మాదకద్రవ్యాల ముఠా అరెస్టు  | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల ముఠా అరెస్టు 

Published Tue, Nov 8 2022 5:49 AM

Drug gang arrested In Chittoor Andhra Pradesh - Sakshi

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా, వినియోగిస్తున్న ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. 34 గ్రాముల బరువున్న మిథైలెనెడియోక్సీ–మెంథాఫేటమైన్‌ (ఎండీఎంఏ) అనే డ్రగ్స్‌ను సీజ్‌ చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో సూడాన్‌ దేశానికి చెందిన అహమ్మద్‌ ఒమర్‌ (28)తో పాటు చిత్తూరుకు చెందిన కె.సిరాజ్‌ (37), కె.సురేష్‌ (25), ఎస్‌.జయశంకర్‌ (32), సి.ప్రతాప్‌ (26), ఎస్‌.తేజకుమార్‌ (22) అనే యువకులున్నారు.

చిత్తూరు ఎస్పీ వై.రిషాంత్‌రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. ఆదివారం నగరంలోని ఇరువారం–యాదమరి కూడలి వద్ద కొంతమంది వ్యక్తులు స్ఫటికల రూపంలో ఉన్న పదార్థాన్ని విక్రయించడం, కొనుగోలు చేస్తుండటాన్ని గుర్తించిన టూటౌన్‌ ఎస్‌ఐలు మల్లికార్జున, లోకేశ్‌ తమ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ముగ్గురు వ్యక్తులు పారిపోగా, ఆ ప్రదేశంలో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

సూడాన్‌ దేశంలోని ఖార్టోమ్‌ సిటీకు చెందిన అహమ్మద్‌ ఒమర్‌ అనే వ్యక్తితో చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం అరగొండకు చెందిన కె.సిరాజ్‌ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ బెంగళూరులో  ఒమర్‌తో స్నేహం చేసేవాడు.

అతని వద్దనుంచి ఎండీఎంఏ అనే మాదకద్రవ్యాన్ని కొనుగోలుచేసి, దాన్ని చిత్తూరు నగరానికి చెందిన సురేష్, జయశంకర్, ప్రతాప్, తేజ, వెంకటేష్, మోహన్, మురళి అనే యువకులకు విక్రయించేవాడు.కాగా, పోలీసులు రూ.2 లక్షల విలువజేసే 34 గ్రాముల మాదకద్రవ్యం, 20 సిరంజీలు, మూడు సెల్‌ఫోన్లు, ఒమర్‌ పాస్‌పోర్టు, వీసాను సీజ్‌ చేశారు.  

Advertisement
Advertisement