సికింద్రాబాద్‌ ఘటన: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!

25 Jun, 2022 13:16 IST|Sakshi

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అల్లర్ల తర్వాత సాక్ష్యాలను తారమారు చేశారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి విధ్వంసం సృష్టించే విధంగా ప్లాన్‌ చేశారన్నారు.  కాగా, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో 8 మంది ఉండగా, పరారీలు మరో 8 మంది ఉన్నారు. అగ్నిపథ్‌ స్కీంతో ఆర్థికంగా నష్టపోతామనే ఆందోళనలకు అకాడమీలను ప్రోత్సహించినట్లు గుర్తించారు.

మరొకవైపు పోలీసుల అదుపులో మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌కు చెందిన ఇద్దరు అకాడమీ డైరెక్టర్లు ఉన్నారు. మరో ఇద్దరు మల్లారెడ్డి, శివసాయి డిఫెన్స్‌ అకాడమీ ఉద్యోగులు, రెడ్డప్ప, హరి సహా మరొకరు ఆందోళనలో ప్రత్యేకంగా పాల్గొన్నట్లు గుర్తించారు.  12 అకాడమీ అభ్యర్థులతో 8 వాట్సాప్‌ గ్రూప్‌ల ఏర్పాటు చేసి విధ్వంసానికి కుట్ర చేశారు.ఈ 8 వాట్సాప్‌ గ్రూపుల్లో 2 వేల మంది ఆందోళనకారులు ఉన్నారు. రైల్వే స్టేషన్‌ అల్లర్ల వెనుక అసలు సూత్రధారి సుబ్బారావును ఏ-64గా రిమాండ్‌ రిపోర్ట్‌లో  పేర్కొనగా, ఏ-65 మల్లారెడ్డి, ఏ-66 శివ కుమార్‌, ఏ-67 బూరెడ్డిలుగా పేర్కొన్నారు.

సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు

వీరంతా బోడుప్పల్‌లోని ఎస్‌వీఎం హోటల్‌లో  అల్లర్లకు ప్లాన్‌ చేసినట్లు రిపోర్ట్‌లో వెల్లడించగా, శివ కుమార్‌తో కలిసి సుబ్బారావు రూ. 35వేలు ఖర్చు చేసి విద్యార్థులను అల్లర్లకు పురి కొల్పాడు. అదే సమయంలో  సీఈఈ సోల్జర్స్‌ గ్రూపు, సోల్జర్స్‌ టూ డై పేరుతో వాట్సాప్‌ గ్రూపులు సృష్టించి విద్యార్థులను అల్లర్లకు ప్రోత్సహించాడు. బిహార్‌లో జరిగినట్లు రైలును తగటబెట్టాలని సుబ్బారావు చెప్పగా, శివ దానిని అమలు చేశాడు. ఆవుల సుబ్బారావుతో నిరంతరం శివ టచ్‌లో ఉన్నాడని, శివ ఆదేశాలతోనే రైలును తగులుబెట్టినట్లు విచారణలో వెల్లడైంది.  

మరిన్ని వార్తలు