ఏనుగు దాడిలో రైతు మృతి  | Sakshi
Sakshi News home page

ఏనుగు దాడిలో రైతు మృతి 

Published Thu, Apr 4 2024 4:02 AM

Farmer killed in elephant attack - Sakshi

ప్రాణహిత నది దాటి కొమురంభీం జిల్లాలోకి ప్రవేశించి... 

చింతలమానెపల్లి మండలం బూరెపల్లిలో ఘటన 

చింతలమానెపల్లి (సిర్పూర్‌): ఏనుగు దాడిలో ఓ రైతు మృత్యువాత పడ్డాడు. మహారాష్ట్రలోని అటవీప్రాంతం నుంచి బుధవారం తెల్లవారుజామున ప్రాణహిత నది దాటి కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలం బూరెపల్లి సమీపంలోని వ్యవసాయ భూము ల్లోకి చొరబడింది. అక్కడే ఉన్న ఓ రైతుపై దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

బుధవారం ఉదయం బూరెపల్లిసమీపంలోని ప్రాణహిత నదిలో ఏనుగును గ్రామస్తులు కొంతమంది గమనించారు. ప్రాణహిత నది నుంచి బూరెపల్లి వ్యవసాయ భూముల వైపు వెళ్లింది. ఆ సమయంలోనే గ్రామ శివారులోని మిరపతోటలో అల్లూరి శంకర్‌(55) భార్య సుగుణబాయి, మరికొందరితో కలిసి పనులు చేసుకుంటున్నాడు. ఏనుగు రాకను గమనించిన సుగుణ బాయి భర్తతోపాటు కూలీలను అప్రమత్తం చేస్తూ పరుగెత్తింది.

తోట నుంచి వెళ్లలేకపోయిన శంకర్‌ అక్కడే ఓ చోట దాక్కున్నాడు. నేరుగా అక్కడికే వచ్చిన ఏనుగు శంకర్‌ను తొండంతో పైకి లేపి విసిరింది. ఎగిరి కింద పడిన అతడిని మళ్లీ కాలితో తొక్కడంతో గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఏనుగు అక్కడి నుంచి బాబాపూర్‌ వైపు వెళ్లడంతో కుటుంబసభ్యులు శంకర్‌ మృతదేహం వద్దకు వెళ్లారు. శంకర్‌కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్‌ పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.10వేలు అందించారు.  

చిక్కని ఏనుగు: కౌటాల సీఐ సాదిక్‌ పాషా, ఖర్జెల్లి రేంజ్‌ అధికారి చంద్రమౌళి ఆధ్వర్యంలో బృందాలు ఏనుగును అనుసరించాయి. గంగాపూర్‌ నుంచి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కాలువల మీదుగా ఖర్జెల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఖర్జెల్లి గ్రామస్తులు ఏనుగు గ్రామం వైపు రాకుండా మంటలు పెట్టారు. రాత్రి కావడంతో ఏనుగు వెళుతున్న మార్గాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రాకపోకలు నిలిపివేశారు. రాత్రి పది గంటల వరకు రుద్రాపూర్‌ సమీపంలో ఏనుగు ఉన్నట్లు గుర్తించారు. 

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా : మంత్రి కొండా సురేఖ 
ఏనుగు దాడిలో అల్లూరి శంకర్‌ మృతి చెందడం పట్ల మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామన్నారు.   

Advertisement
Advertisement