వారం రోజుల్లో బిడ్డ పెళ్లి.. బట్టలతో తిరిగి వస్తాడనుకున్న ఆ తండ్రి... | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో బిడ్డ పెళ్లి.. బట్టలతో తిరిగి వస్తాడనుకున్న ఆ తండ్రి...

Published Mon, Nov 15 2021 7:39 PM

Father Deceased Road Accident Buy Daughter Marriage Clothes Nalgonda - Sakshi

సాక్షి ,నాంపల్లి(మర్రిగూడెం): పెళ్లింట విషాదం అలుముకుంది. కుమార్తె వివాహానికి దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మర్రిగూడ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య (55) కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. మరో వారం రోజుల్లో జరిగే పెళ్లి వేడుకకు దుస్తులు కొనుగోలు చేసేందుకు శంకరయ్య, సమీప బంధువులు నలుగురితో కలిసి ఆటోలో మాల్‌కు బయలుదేరారు. (చదవండి: Nizamabad: యాక్సిడెంట్‌ చేసిన భయంతో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ )

మార్గమధ్యలో ఎర్రగండ్లపల్లి వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న బైక్‌ను ఆటో ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న శంకరయ్య ఎగిరి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న నలుగురితో పాటు బైక్‌పై నల్లగొండ నుంచి మాల్‌కు వెళ్తున్న గౌరి మల్లేష్, యోగితకు స్వల్పగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీప పీహెచ్‌సీకి తరలించారు. సమాచారం మేరకు ఎస్‌ఐ నాగుల్‌ మీరా ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

నిలిచిన వివాహం
వట్టిపల్లి గ్రామంలో గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న శంకరయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. ఇటీవల కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. అయితే, మూడు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన శంకరయ్య సమీప బంధువులు చింతపలిపల్లి మండలం వెంకటేశ్వరనగర్‌ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.

ఈ దుర్ఘటన కారణంగానే శంకరయ్య కుమార్తె వివాహ పనులు ఆలస్యమయ్యాయి. మరో వారం రోజుల్లో ఇంట్లో శుభకార్యం ఉండగా ఇంటిపెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వివాహం నిలిచిపోయిందని మృతుడి బంధువులు తెలిపారు. ‘కుమార్తె పెళ్లి బట్టలు తీసుకొచ్చేందుకు వచ్చి ఇక్కడ నిద్దరోయావా అయ్యా’ అంటూ శంకరయ్య భార్య యాదమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. 

చదవండి: Vikarabad: కారుతో ఢీకొట్టి పరార్‌.. ప్రమాదమా? హత్యాయత్నమా?
 

Advertisement
Advertisement