షాకింగ్‌ ఘటన.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఏ మార్చి.. 

29 Sep, 2022 11:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): బ్యాంకులో నగదు జమ చేసేందుకు వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వేరొకరికి సాయం చేస్తుండగా , ఆమెను ఏ మార్చి ఓ మహిళా దొంగ నగదు, సెల్‌ఫోన్‌ను అపహరించింది. అనంతరం మరో వ్యక్తితో కలిసి స్కూటీపై పారిపోయేందుకు యత్నించగా పోలీసులు ఛేజ్‌ చేసి పట్టుకున్నారు. ఈ ఘటన ఆత్మకూరులో బుధవారం  చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలి వివరాల మేరకు.. పంటవీధికి చెందిన అభిజ్ఞ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.  మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మున్సిపల్‌ బస్టాండ్‌ సమీపంలోని ఓ ఏటీఎంలో రూ.28 వేలు నగదు డ్రా చేసుకుంది. అనంతరం  ఇండియన్‌ బ్యాంకుకు జమచేసేందుకు వచ్చింది.
చదవండి: అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్‌ ఫాదర్‌’ 

బ్యాంకులో ఓ వ్యక్తి నగదు డ్రా చేసుకునేందుకు ఓచర్‌ రాసి ఇవ్వాలని ఆమెను సాయం కోరగా, చేసేందుకు తన నగదు పర్సు, సెల్‌ఫోన్‌ పక్కన పెట్టింది. ఈ క్రమంలో చిన్నపాపను ఎత్తుకుని బ్యాంకులో తచ్చాడుతున్న ఓ మహిళ అదును చూసి పర్సు, సెల్‌ఫోన్‌ అపహరించుకుని పరిగెత్తింది. వెంటనే అప్రమత్తమైన అభిజ్ఞ దొంగ వెంట పరిగెత్తగా, అప్పటికే బ్యాంకు ఎదురుగా స్కూటీపై సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తితో కలిసి పరారైంది. కేకలు పెడుతూ వెనుకనే పరిగెత్తిన అభిజ్ఞ కొద్దిదూరంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఎం శివశంకర్‌రావును కలిసి జరిగిన విషయాన్ని వివరించారు.

దీంతో  బాధితురాలి సెల్‌ఫోన్‌ సంకేతాల ఆధారంగా వారు ఏ వైపునకు వెళ్లింది గుర్తించి ఏఎస్‌పేట మార్గంలో సిబ్బందితో కలిసి వెంబడించారు. ఏఎస్‌పేట పోలీసులకు సైతం సమాచారం ఇచ్చారు. ఏఎస్‌పేట శివారులోని వినాయకనగర్‌ వద్ద వేగంగా స్కూటీ వెళ్తున్న దొంగలు అదుపుతప్పి పడిపోయారు. ఏఎస్‌పేట పోలీసులు దొంగలను గుర్తించి పట్టుకునేందుకు యత్నించగా మహిళ, ఆమెతో ఉన్న పాప చిక్కారు.

బైక్‌ తోలుతున్న మరో వ్యక్తి తన చేతిలోని నగదును పర్సుతో సహా విసిరేసి పరారయ్యాడు. ఆత్మకూరు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడిన మహిళను విచారించారు. అక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును సేకరించగా రూ.26 వేలు లభించింది. బిడ్డతో సహా మహిళను ఆత్మకూరు స్టేషన్‌కు తరలించారు. దొంగలది ప్రాకం పరారైన వ్యక్తి మహిళ భర్తేనని సమాచారం. వారు పరారవుతూ పడిపోవడంతో వదిలి వెళ్లిన స్కూటీని ఆత్మకూరు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.    

మరిన్ని వార్తలు