లుధియానాలో రూ.7 కోట్ల దోపిడీ | Sakshi
Sakshi News home page

లుధియానాలో రూ.7 కోట్ల దోపిడీ

Published Sun, Jun 11 2023 5:45 AM

Gang robs Rs 7 crore from cash management company in Ludhiana - Sakshi

లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులకు సేవలందించే సీఎంఎస్‌ సెక్యూరిటీస్‌ కార్యాలయం నుంచి సుమారు రూ.7 కోట్ల నగదును ఆగంతకులు ఎత్తుకుపోయారు. న్యూ రాజ్‌గురు నగర్‌లో ఉన్న సంస్థ ఆఫీసులోకి శనివారం అర్ధరాత్రి దాటాక సుమారు 10 మంది ముసుగులు ధరించిన దుండగులు ప్రవేశించారు. భద్రతా సిబ్బందిని తుపాకీతో బెదిరించి, గదిలో బంధించారు. వారి సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారు.

అనంతరం అక్కడ దొరికిన సుమారు రూ.7 కోట్ల నగదుతో సీఎంఎస్‌కు చెందిన వ్యానులోనే ఉడాయించారు. సీసీ టీవీ కెమెరాలను కూడా వెంట తీసుకెళ్లారు. చోరీ సమాచారం ఉదయం 7 గంటల సమయంలో పోలీసులకు అందింది. లుధియానా పోలీస్‌ కమిషనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ సిద్ధు ఘటనాస్థలిని పరిశీలించారు. తీసుకెళ్లిన వ్యానును ముల్లన్‌పూర్‌ దాఖా వద్ద దొంగలు వదిలేసి వెళ్లారని, అందులో రెండు ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. ‘సీఎంఎస్‌ సంస్థ నిర్లక్ష్యం వల్లే దోపిడీ జరిగింది.

లాకర్లలో భద్రపరచాల్సి ఉండగా నగదును వ్యానుల్లోనూ, కార్యాలయం గదిలోనూ అజాగ్రత్తగా వదిలేసినట్లు తేలింది. ఘటన సమయంలో సంస్థ సిబ్బందిలో ఇద్దరి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. ఎంత నగదు పోయిందనే విషయంలో బాధిత సంస్థ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఘటనలో లోపలి వ్యక్తుల ప్రమేయం పైనా దర్యాప్తు జరుపుతున్నాం’అని తెలిపారు. కేసును ఛేదించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్‌ టాస్క్‌ఫోర్స్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ సాయం కూడా తీసుకుంటున్నామన్నారు. 

Advertisement
Advertisement