దొరికిన బంగారు గొలుసు.. బాధితురాలికి ఇవ్వాలని ఠాణాకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి | Sakshi
Sakshi News home page

దొరికిన బంగారు గొలుసు.. బాధితురాలికి ఇవ్వాలని ఠాణాకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి

Published Sat, Mar 23 2024 7:27 AM

gold merchant heart attack in hyderabad - Sakshi

ఆటోలో గొలుసు పోగొట్టుకున్న మహిళ 

బాధితురాలికి ఇవ్వాలని ఠాణాకు వెళ్లిన వ్యక్తి   
 
పోలీస్‌స్టేషన్‌లోనే గుండెపోటుతో హఠాన్మరణం

హైదరాబాద్‌: ఆటోలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి అప్పగించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఓ నగల వ్యాపారి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన షాయినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సౌత్‌వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గోషామహల్‌ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. నల్లకుంటకు చెందిన కోర్టు ఉద్యోగిని మేఘన శుక్రవారం ర్యాపిడో ఆటోలో హైకోర్టుకు వెళ్లింది. కోర్టుకు వెళ్లిన తర్వాత మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో తన భర్తకు ఫోన్‌ చేసి సమాచారం అందించింది. 

ఆ తర్వాత కొద్ది సేపటికే అదే ఆటోను బుక్‌ చేసుకున్న వెండి నగల వ్యాపారి గోవింద్‌రామ్‌ సోని (70) బేగంబజార్‌ నుంచి కోఠీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.. ఈ క్రమంలో అతడికి ఆటోలో పడి ఉన్న బంగారు గొలుసు కనిపించింది. దీంతో ఆటో డ్రైవర్‌ నునావత్‌ తరుణ్‌ను వివరాలు అడగడంతో హైకోర్టు వద్ద ఓ మహిళను వదిలిపెట్టి వస్తున్నానని, సదరు గొలుసు ఆమెదే అయి ఉండవచ్చని చెప్పాడు. దీంతో గోవింద్‌రామ్‌ సోనీ నేరుగా అదే ఆటోలో షాయినాయత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి గొలుసును పోలీసులకు అప్పగించాడు. 

ఇంతలోనే బాధితురాలు మేఘన ఆటో డ్రైవర్‌కు ఫోన్‌ చేసి గొలుసు విషయమై ఆరా తీసింది. సదరు ఆటో డ్రైవర్‌కు ఆమెకు విషయం చెప్పడంతో భర్తతో కలిసి పీఎస్‌కు వచి్చన బాధితురాలికి పోలీసుల సమక్షంలో గోవింద్‌రామ్‌ సోనీ బంగారు గొలుసును అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే అతను కుప్పకూలి పోవడంతో అప్రమత్తమైన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోవింద్‌రామ్‌ సోనీ అప్పటికే మృతి చెందినట్లు  నిర్ధారించారు. సహాయం చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచి్చన గోవింద్‌రామ్‌ సోనీ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని డీసీపీ విచారం వ్యక్తంచేశారు.    

Advertisement
Advertisement