పోలీసులు సమీక్షల్లో దొంగలు చోరీల్లో  | Sakshi
Sakshi News home page

పోలీసులు సమీక్షల్లో దొంగలు చోరీల్లో 

Published Wed, Sep 6 2023 4:37 AM

Gold Robbery In Warangal  - Sakshi

వరంగల్‌ క్రైం/రామన్నపేట: చోరీలు, నేరాలను ఎలా కట్టడి చేయాలా..అని పోలీసులు ఓ పక్కన సమీక్షిస్తుండగా.. మరోపక్క అదే సమయంలో దొంగలు స్వైర విహారం చేసి దర్జాగా దోచుకుపోయిన ఘటనలు వరంగల్‌ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నాయి. పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష జరుపుతుండగా అదే సమయంలో దొంగలు మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఆరు ఫ్లాట్లలో చోరీలకు పాల్పడ్డారు.

మొత్తం 178 తులాల బంగారం, కొంత నగదు, వెండి అపహరించారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హనుమకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధి నయీంనగర్‌లోని కల్లెడ అపార్ట్‌మెంట్‌లో సుమారు 12 తులాలు, కిషనపురలోని లహరి అపార్ట్‌మెంట్‌లో 14 తులాలు, మారుతీ వాసవి అపార్ట్‌మెంట్‌లో 60 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మారుతీ అపార్ట్‌మెంట్‌లో ప్రకాశ్‌రెడ్డికి చెందిన 401 ప్లాట్‌లో తాళం పగులగొట్టి 14 గ్రాముల బంగారు గొలుసును చోరీ చేశారు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గాయత్రీ అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో 52 తులాల బంగారంతోపాటు సుమారు రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారు.

దాని పక్కనే ఉన్న వద్దిరాజు అపార్ట్‌మెంట్‌లో 39 తులాల బంగారం, రూ.22వేల నగదు అపహరించారు. ముఖాలకు మాస్క్‌ ధరించి చోరీ చేసిన తరువాత దుండగులు దర్జాగా వెళ్తున్న దృశ్యాలు ఆయా అపార్ట్‌మెంట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరంతా ఒక కారులో వచ్చినట్లు తెలిసింది.వరంగల్‌ క్రైం/రామన్నపేట

Advertisement

తప్పక చదవండి

Advertisement