పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో దాడి, చనిపోయాడని వదిలి వెళ్లారు.. చివరికి | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో దాడి, చనిపోయాడని వదిలి వెళ్లారు.. చివరికి

Published Sat, Jan 22 2022 11:41 AM

Group Of People Attack Man In The Name Of Police Informer Warangal - Sakshi

సాక్షి, వరంగల్: పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓప్రైవేట్‌ ఉద్యోగిపై అదే కులానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. అతను చనిపోయాడని భావించి ప్రత్యర్థి వర్గంవారు అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ ఘటన హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితుడి తండ్రి హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై దాడి జరిగిందని ప్రత్యర్థి వర్గం వారు కూడా కౌంటర్‌ పిటిషన్‌ ఇచ్చారు. 

వివరాలు..  హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన ముస్కు శ్యాంరావు ప్రశాంత్‌ పైవేట్‌ ఉద్యోగి. అయితే శ్యాంరావు ప్రశాంత్‌ పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తూ తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నాడని అదే కులానికి చెందిన పెద్ద మనుషులకు అనుమానం. ఈ విషయమై  పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. కాగా, గురువారం రాత్రి శ్యాంరావు ప్రశాంత్‌పై ఇదే గ్రామానికి చెందిన ముస్కు దేవేందర్, ముస్కు చంద్రకాంత్, శ్యాంరావు చందు, రంగుల శివ, ముస్కు ప్రసాద్, ముస్కు శేఖర్, ముస్కు రాము, ముస్కు శ్రీనివాస్, ముస్కు రాజమౌళి, ప్రేమ్‌తో పాటు మరికొంతమంది వ్యక్తులు, కర్రలతోదాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ దాడిలో ప్రశాంత్‌ ఆస్పత్రిలో చేరాడని బాధితుడి తండ్రి శ్యాంరావు రఘు తెలిపాడు. ఇదిలా ఉండగా, కుల పెద్ద మనిషి రాజమౌళిపై శ్యాంరావు ప్రశాంత్, సాయిలు దాడి చేస్తున్నారని సమాచారం మేరకు అక్కడికి చేరినట్లు దొమ్మరికుల సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో దొమ్మరికుల సంఘానికి చెందిన ముగ్గురికి గాయాలైనట్లు వారు పేర్కొన్నారు. శ్యాంరావు ప్రశాంత్, అతని కుటుంబసభ్యుల నుంచి ప్రాణ హానీ ఉందని ఆ ఫిర్యాదులో వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement