చిట్యాల ఎంపీపీ కుటుంబంపై హత్యాయత్నం! | Sakshi
Sakshi News home page

నల్గొండలో భగ్గుమన్న పాతకక్షలు

Published Wed, Sep 16 2020 9:04 AM

High Drama After Midnight In Nalgonda Between TRS Party Activists - Sakshi

సాక్షి, నల్గొండ : జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దాటాకా పాత కక్షలు భగ్గుమన్నాయి. చిట్యాల ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ కుటుంబంపై  అర్ధరాత్రి 12 గంటలకు 4 కార్లలో వచ్చిన కిరాయి హంతకులు వారిపై హత్యాప్రయత్నం చేశారు. ఈ ఘటన చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయితే గ్రామంలోని ప్రజలు వెంటపడడంతో ఊర్లో ఉన్న పాత నేరస్థునితో సహా 9 మంది పట్టుబడగా.. మిగతా 15 మంది పరారీలో ఉన్నారు.

అసలు విషయానికి వస్తే.. పేరేపల్లికి చెందిన కొలను వెంకటేశ్‌, అదే గ్రామానికి చెందిన అంతటి వెంకటేశ్‌ గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచే ఇద్దరు సర్పంచ్‌ ఎన్నికకు పోటీలో నిలిచారు. ఈ సందర్భంగా కొలను వెంకటేశ్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో అంతటి వెంకటేశ్‌ చేతిలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కొలను వెంకటేశ్‌ భార్య సునీత పోటీ చేసి గెలిచి చిట్యాల ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇది జీర్ణించుకోలేని అంతటి వెంకటేశ్‌ కొలను వెంకటేశ్‌పై కక్ష పెంచుకున్నాడు.. దీంతోపాటు ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు చోటుచేసుకున్నాయి. కాగా మంగళవారం ఎంపీపీ సునీత భర్త వెంకటేశ్‌ పుట్టినరోజు పురస్కరించుకొని వేడుక నిర్వహించేందుకు కుటుంబసభ్యులతో కలిసి పేరేపల్లికి వచ్చారు.

ఈ క్రమంలో సమాచారం అందుకున్న అంతటి వెంకటేశ్‌ అనుచరుడు జగన్‌ వారిని హత్య చేయించేందుకు ఇదే సరైన సమయమని భావించి హైదరాబాద్‌ నుంచి 15 మంది కిరాయి రౌడీలను నాలుగు కార్లలో రప్పించాడు. అయితే రౌడీలు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కుటుంబసభ్యులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో పారిపోయేందుకు ప్రయత్నించిన రౌడీలలో 9 మందిని స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితులంతా చిట్యాల పోలీస్‌స్టేషన్‌ ఉన్నారు.

Advertisement
Advertisement