ప్రేమ పెళ్లి.. భార్యపై అనుమానం.. చివరికి ఊహించని ఘటన

3 Oct, 2022 08:17 IST|Sakshi

సత్తెనపల్లి(పల్నాడు జిల్లా): మూడుముళ్ల బంధం.. అనుమానపు కత్తులకు ముక్కలైంది. ఏడడుగుల అనుబంధం.. అపోహల అగాథంలో చిక్కి విచ్చిన్నమైంది. క్షణికావేశం.. ఓ బాలిక బంగారు భవిష్యత్తును బలిపీఠం ఎక్కించింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త అతి కిరాతకంగా ఆమెను హతమార్చిన  ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..  సత్తెనపల్లి ఒకటో వార్డు అచ్చంపేట రోడ్డుకు చెందిన పసుపులేటి విజయలక్ష్మి (40), నాగరాజు దంపతులు. వీరి కులాలు వేరైనా 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
చదవండి: విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్‌ తీస్తుండగా..

నాగరాజు అబ్బూరు రోడ్డులోని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ముఠా పనికి వెళ్తుండగా, భార్య విజయలక్ష్మి ఇంటి వద్దే టైలరింగ్‌ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది. కొంతకాలం వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు జన్మిచారు. కుమారుడు ఐదేళ్ల వయస్సులోనే మరణించాడు. కుమార్తె మీనాక్షి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. నాగరాజుకు భార్య విజయక్ష్మిపై ఐదేళ్ళ నుంచి అనుమానం ఉంది.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. విభేదాలు తారాస్థాయికి చేరడంతో గతంలో నాగరాజు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుమార్తెను పెట్టుకొని విజయలక్ష్మి జీవించింది. కుమార్తె భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరూ కలిసి ఉండాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. అయితే మళ్లీ భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు నాలుగునెలలుగా వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం  ఇంటికి వచ్చిన నాగరాజు ఇంట్లో పనులు చేసుకుంటున్న భార్య తలపై ఇనుప బద్దెతో గట్టిగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

నాగరాజు పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి టౌన్‌ సీఐ యు.శోభన్‌ బాబు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరి నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తల్లి విజయలక్ష్మి మృతి చెంది రక్తపు మడుగులో పడి ఉండటం, తండ్రి నాగరాజు పరారీ కావడంతో అమ్మా నాకు దిక్కెవరమ్మా.. ఒక్కసారి లేమ్మా అంటూ కుమార్తె మీనాక్షి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కలచి వేస్తోంది. నాగరాజు సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు