ఢిల్లీ పేలుడు : ఇది ట్రైలర్‌ మాత్రమే

30 Jan, 2021 12:34 IST|Sakshi

 ట్రైలర్‌ మాత్రమే  అంటూ లేఖ

ఉగ్రదాడి కావచ్చు :  ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా

అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్‌

సాక్షి,  న్యూఢిల్లీ :  దేశ రాజధాని  ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో సంభవించిన  ఐఈడి పేలుడు ఆందోళన  రేపింది.  దీనిపై కేంద్రం  సీరియస్‌గా స్పందిస్తోంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రికి పూర్తి రక్షణ కల్పిస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హామీ ఇచ్చారు.అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సీనియర్ పోలీసు అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని  సమీక్షిస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతర దేశాల రాయబార కార్యాలయాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు  అలాగే దేశంలోని పలు విమానాశ్రయాల్లో గట్టి భద్రతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఢిల్లీ, ముంబై, జైపూర్‌, యూపీ తదితర స్టేట్స్‌లో విమానాశ్రయాలకు హై అలర్ట్‌ ప్రకటించారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, సహా అన్ని ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైపూర్ నగరంలో హై అలర్ట్  ప్రకటించామని రాజస్థాన్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు జరిగిన ప్రదేశానికి స​మీపంలో సుమారు 50 మీటర్ల దూరంలో  అబ్దుల్ కలాం రోడ్డులో  శుక్రవారం సాయంత్రం ఈ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ కమిషనర్ (డిసిపి) ప్రమోద్ కుష్వాతో సహా సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  ఢిల్లీలో తనిఖీలను ముమ‍్మరం చేశారు. ఈ క్రమంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలన సందర్భంగా పేవ్‌మెంట్ కింద పేలుడు పదార్థాలను అమర్చినట్టు గుర్తించారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ వినియోగించినట్టు ఫోరెన్సిక్ ఆధారాలను బట్టి అధికారులు భావిస్తున్నారు.  దీంతోపాటు క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు అక్కడ దిగినట్టు గుర్తించిన పోలీస్ స్పెషల్ సెల్ అధికారులుక్యాబ్ డ్రైవర్‌నుంచి వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ రాయబారికి పంపినట్టుగా భావిస్తున్న పింక్  స్కార్ఫ్‌,  ఒక కవరును కూడా సంఘటనా స్థలానికి 12 గజాల దూరంలో స్వాధీనం చేసుకున్నారు. పేలుడును “ట్రైలర్” గా ఈలేఖలో ప్రకటించినట్టు తెలుస్తోంది. అలాగే గత ఏడాది హత్యకు గరైన ఇరాన్ టాప్‌ సైనికాధికారి  ఖాసిం సోలైమాని, అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదేహ్ లను అమర వీరులుగా పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రతీకార​ చర్యగానే ఈ దాడి జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరోవైపు ఈ పేలుడు 'ఉగ్రవాద దాడి' కావచ్చని రాయబారి రాన్ మాల్కా చెప్పారు. భారత అధికారులపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. అటు ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరగణిస్తున్నామని ఇజ్రాయె మంత్రి గబీ అష్కెనాజీ  వెల్లడించారు. తమ దౌత్యవేత్తలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. దర్యాప్తు జరుగుతోందని, దోషులను  క్షమించే ప్రశ్నే లేదంటూ ట్విట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు