సోషల్‌ మీడియాలో చూసి నేర్చుకున్నాడు! | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో చూసి నేర్చుకున్నాడు!

Published Wed, Feb 28 2024 1:27 PM

Man arrested by Hyderabad Police for making fake online - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్‌ పేరుతో సోషల్‌మీడియాలో నకిలీ ఖాతాలు క్రియేట్‌ చేసి, డబ్బు డిమాండ్‌ చేసింది రాజస్థాన్‌కు చెందిన జాఫర్‌ ఖాన్‌గా తేలింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు చెందిన ప్రత్యేక బృందం ఇతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చింది. ఇతను దాదాపు 20 మంది ప్రముఖుల పేర్లతో ఇదే తరహాలో నకిలీ సృష్టించినట్లు వెలుగులోకి వచ్చిందని అదనపు సీపీ (నేరాలు) ఏవీ రంగనాథ్‌ మంగళవారం వెల్లడించారు. రాజస్థాన్‌లోని సమోలా ప్రాంతానికి చెందిన జాఫర్‌ ఖాన్‌ ఇంటరీ్మడియట్‌ వరకు చదివాడు. ఆపై బతుకుతెరువు కోసం  ఓ స్పేర్‌పార్ట్స్‌ దుకాణంలో పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం మీడియాలో వచ్చిన ఓ వార్త ఇతడి దృష్టిని ఆకర్షించింది.

 ఉత్తరాదికి చెందిన అనేక మంది దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల పేర్లు, ఫొటోలు వినియోగించి సోషల్‌మీడియాలో నకిలీ ఖాతాలు తెరుస్తున్నారని, వీటిని వినియోగించి పలువురిని డబ్బు అడుగుతున్నారని దాని సారాంశం. దీనికి ఆకర్షితుడైన అతగాడు తాను కూడా అదే పంథా అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. తెలంగాణతో పాటు జమ్మూకశీ్మర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యే వివరాలను ఇంటర్‌నెట్‌ నుంచి తెలుసుకున్నాడు. దాని ద్వారానే ఫొటోలు డౌన్‌లోడ్‌ చేశాడు. వీటిని వినియోగించి ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల్లో ఫేక్‌ ఖాతాలు తెరవడంతో పాటు ఓ నెంబర్‌తో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేశాడు. 

మారు పేర్లతో రూపొందించిన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఆయా అధికారులు, నేతలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపి యాక్సెప్ట్‌ చేయించుకున్నాడు. ఇలా ఇతడికి వాళ్ల ఫ్రెండ్స్‌ లిస్టులో ఉన్న వారి వివరాలు తెలిశాయి. ఆ తర్వాత అసలు కథ ప్రారంభించిన ఇతగాడు తాను  రూపొందించిన దాదాపు 20 నకిలీ ఖాతాల నుంచి ఆయా ప్రముఖులు, అధికారుల ఫ్రెండ్స్‌కు సందేశాలు పంపేవాడు. వివిధ రకాలైన సాంకేతిక కారణాలు చెబుతూ చిన్న చిన్న మొత్తాలు డిమాండ్‌ చేసేవాడు. డిస్‌ప్లే పిక్చర్లు చూసి మోసపోతున్న వారు జాఫర్‌ ఖాన్‌ అడిగిన మొత్తం బదిలీ చేశారు. ఇతను గత నెలలో సీవీ ఆనంద్‌ పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల్లో ఖాతాలు తెరిచాడు. 

ఈ విషయాన్ని గుర్తించిన ఏసీబీ ఐటీ సెల్‌ అధికారులు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కె.సైదులు నేతృత్వంలోని బృందం కేసు దర్యాప్తు చేసింది. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడు జాఫర్‌ ఖాన్‌ను గుర్తించిన పోలీసులు సమోలాలో ఉన్న అతడిని అరెస్టు చేసి తీసుకువచ్చారు. న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీíÙయల్‌ రిమాండ్‌కు తరలించారు. తనకు దక్షిణాదికి చెందిన వారు ఎవరూ డబ్బు చెల్లించలేదని, ఉత్తరాది వాళ్లు మాత్రం తరచూ చెల్లిస్తున్నారని ప్రాథమిక విచారణలో జాఫర్‌ ఖాన్‌ వెల్లడించాడు. పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఇతడిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. 

Advertisement
Advertisement