సహజీవనం చేస్తున్న మహిళపై.. ఇద్దర్ని హతమార్చి.. మరొకర్ని చంపబోతూ | Sakshi
Sakshi News home page

సహజీవనం చేస్తున్న మహిళపై.. ఇద్దర్ని హతమార్చి.. మరొకర్ని చంపబోతూ

Published Sun, Jan 23 2022 4:01 AM

Man Assassinated Two People And attacked another person at Kaligiri - Sakshi

ఒంగోలు/కలిగిరి: సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెంచుకున్నాడు. ఆ ఇద్దరిమధ్యా తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆ మహిళ తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబంపై కత్తిదూసిన హంతకుడు ఆమె సోదరుడి భార్యను, కుమారుడిని పట్టపగలే చంపేశాడు. అక్కడి నుంచి ఒంగోలు చేరుకుని తాను సహజీవనం చేసిన మహిళతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో కత్తితో మరో వ్యక్తి గొంతు కోసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. శనివారం చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన నూర్జహాన్‌కు నెల్లూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కొంతకాలానికి భర్తతో విడిపోయింది. కాగా, కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన సమీప బంధువు షేక్‌ రబ్బానీ సోదరితో నూర్జహాన్‌ సోదరుడికి వివాహమైంది. ఆ తర్వాత నూర్జహాన్, అవివాహితుడైన రబ్బానీ మధ్య సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు. వయసు ఇప్పుడు ఆరేళ్లు. 

అనుమానం పెనుభూతమై..
రబ్బానీ ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో టీ దుకాణం నిర్వహిస్తూ నూర్జహాన్, కుమారుడితో కలిసి ఉంటున్నాడు.  రబ్బానీ స్థానిక సత్యన్నారాయణపురానికి చెందిన మండ్ల కాశీకుమార్‌ అనే యువకుడిని తన టీ దుకాణంలో పనిలో పెట్టుకున్నాడు. కాగా, నూర్జహాన్‌తో కాశీకుమార్‌ చనువుగా ఉండటంతో వారిద్దరిపైనా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రబ్బానీ, నూర్జహాన్‌ మధ్య విభేదాలొచ్చాయి. దీంతో నూర్జహాన్‌  అంబటివారిపాలెంలోని తన మరో సోదరుడు మస్తాన్‌ ఇంట్లో ఉంటోంది. నూర్జహాన్‌ను తన నుంచి దూరం చేసేందుకే కనిపించకుండా చేశారని భావించిన రబ్బానీ.. మస్తాన్‌ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. అంబటివారిపాలెంలోని మస్తాన్‌ ఇంటికి శనివారం చేరుకున్నాడు. ఆ సమయంలో మస్తాన్‌ నెల్లూరు వెళ్లగా.. మస్తాన్‌ భార్య మీరమ్మ (45)తో గొడవపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో మీరమ్మ మెడపై నరికాడు. తల్లిపై దాడిని అడ్డుకోబోయిన ఆమె కుమారుడు అక్బర్‌ ఆలీఫ్‌ (23)ని పొడిచాడు. తల్లీకుమారులు అక్కడికక్కడే మృతిచెందారు.

మరో హత్య చేయబోయి..
అనంతరం రబ్బానీ మోటార్‌ సైకిల్‌పై ఒంగోలు చేరుకున్నాడు. తన టీ దుకాణంలో పనిచేసిన మండ్ల కాశీకుమార్‌పై మంగమ్మ కాలేజీ జంక్షన్‌ సమీపంలో దాడిచేసి కత్తితో గొంతు కోశాడు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ హుటాహుటిన అక్కడకు చేరుకుని రబ్బానీని అదుపులోకి తీసుకుని తాలుకా పోలీసులకు సమాచారం అందించారు.  గాయపడిన కాశీకుమార్‌ను రిమ్స్‌కు తరలించారు. తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నూర్జహాన్‌ను ఆరు నెలలుగా కాశీకుమార్‌ నెల్లూరులో దాచి అక్కడకు వెళ్లి వస్తున్నాడని, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అందుకే కడతేర్చేందుకు యత్నించినట్లు పేర్కొన్నాడు. నూర్జహాన్‌ ఎక్కడ ఉందనేది తెలిసినా  మీరమ్మ చెప్పనందునే ఆమెను, అడ్డువచ్చిన ఆమె బిడ్డనూ చంపేసినట్లు పోలీసులతో చెప్పినట్టు తెలిసింది.  పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement