బాకీ తీర్చమన్నందుకు తల్లి, కుమారుడి హత్య

11 May, 2021 06:43 IST|Sakshi

వేలూరు(తిరువణ్ణామలై): బాకీ తీర్చమన్నందుకు తల్లి, కుమారుడిని హతమార్చినట్లు నిందితులు తమ వాంగ్మూలంలో పోలీసులకు తెలిపారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపాన ఉన్న వడమాదిమంగళం పెద్ద చెరువులో గత ఏడాది నవంబర్‌లో ఓ మహిళ హత్యకు గురైంది. ఆమె చెన్నై బ్రాడ్‌వేలోని పిడారియార్‌ ఆలయం వీధికి చెందిన ఆర్ముగం భార్య లక్ష్మి(63)గా తెలిసింది.

లక్ష్మి హత్య కేసులో పులియాంతోపు ప్రాంతానికి చెందిన తమిళ్‌సెల్వన్, భారతి అనే ఇద్దరు కళంబూరు వీఏఓ ఇరులప్పన్‌ వద్ద ఆదివారం స్వచ్ఛందంగా లొంగిపోయారు. దీంతో కళంబూరు పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వారు చెప్పిన వివరాల మేరకు.. చెన్నైలో కరివేపాకు వ్యాపారం చేసే లక్ష్మి, తన షాపును విక్రయించేందుకు నిర్ణయించింది.

ఈ విషయాన్ని రాందాస్‌(40)కు తెలపడంతో అతను మురళి, రాజారాంకు రూ.27.5 లక్షలకు షాపును విక్రయించారు. వీరు అడ్వాన్స్‌గా రూ.17 లక్షలు ఇచ్చారు. ఇందులో 7లక్షలను రాందాస్‌ లక్ష్మి నుంచి రుణంగా తీసుకున్నాడు. ఈ రుణాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా లక్ష్మి, ఆమె కుమారుడు ప్రేమ్‌కుమార్‌ రాందాస్‌ను కోరారు.

దీంతో ఆగ్రహించిన రాందాస్‌ తన స్నేహితుడు తమిళ్‌సెల్వన్‌(42), ఆటో డ్రైవర్‌ రాజుతో కలిసి ప్రేమ్‌కుమార్‌కు మద్యం తాగించి దాడి చేసి హతమార్చారు. ఆ తరువాత లక్ష్మికి ఫోన్‌లో మాట్లాడి.. ప్రేమ్‌కుమార్‌ ఒక మహిళతో తిరువన్నామలై జిల్లాలోని ఓ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపి.. ఆమెను ఆరణి సమీపాన ఉన్న కళంబూరు చెరువు వద్దకు రప్పించి హతమార్చారు. ప్రేమ్‌కుమార్‌ హత్యలో ఆటోడ్రైవర్‌ రాజు అరెస్టు కావడంతో మిగిలిన నిందితులు కూడా భయంతో లొంగిపోయారు.
చదవండి: సుశీల్‌ కుమార్‌ ఎక్కడ?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు