ప్రముఖ వ్యాపారులను బురిడీ కొట్టించిన ఘనుడు | Sakshi
Sakshi News home page

ప్రముఖ వ్యాపారులను బురిడీ కొట్టించిన ఘనుడు

Published Mon, Jul 17 2023 9:48 AM

Man Fraud of Nippy delivery service  - Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో తమను మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కె.శ్రీనివాసరావును నగరంలోని ప్రముఖ వ్యాపారులు ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఆయన కేసును బుక్కరాయసముద్రం పోలీసులకు బదిలీ చేశారు. బాధితులు తెలిపిన మేరకు... వైఎస్సార్‌ జిల్లా కడప మండలం రూకవారిపల్లికి చెందిన పసుపులేటి అంకుశం 24 రోజుల క్రితం బీకేఎస్‌ పరిధిలోని పసుపులేటి మాతా గోదాములో నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. నగరంలోని ప్రముఖ వ్యాపారులను పిలిపించి ప్రారం¿ోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపించాడు. 

తన వ్యాపారం గురించి వివరించాడు. తనతో కలసి వ్యాపారం చేయడం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని నమ్మబలికాడు. సరుకును విక్రయించిన అనంతరం తన కమీషన్‌ పట్టుకుని మిగులు మొత్తాన్ని అందజేస్తానని అంకుశం తెలపడంతో   అందరూ ఒప్పుకున్నారు. అతని మాయలో      చిక్కుకున్న వ్యాపారులు తమ వద్ద సరుకులను   అప్పగించారు. వీటితో గోదాము నిండిపోయింది. అది చూసిన వ్యాపారులు వ్యాపారం బాగా చేస్తున్నాడని మురిసిపోయారు. అయితే రాత్రికి రాత్రే లారీల కొద్ది సరుకును తీసుకుని అంకుశం మాయమయ్యాడు. దీంతో మోసపోయిన వ్యాపారులు ముందుగా అతని గురించి ఆరా తీశారు.  

అనంతలోనే రూ.70 లక్షలకు పైగా సరుకుతో ఉడాయించిన అంకుశం అక్రమాలకు నెల్లూరు జిల్లాలో రూ.3 కోట్లు, కర్నూలు జిల్లాలో రూ. కోటికి పైగా వ్యాపారులు మోసపోయినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే   అంకుశం జాడ తెలుసుకుని అతని ఇంటికి వెళితే కుటుంబసభ్యులు ఎదురు దాడికి దిగడంతో చేసేది లేక అనంతపురం తిరిగి వచ్చి ఎస్పీ శ్రీనివాసరావును కలసి జరిగిన మోసాన్ని వివరించారు. వ్యాపారుల ఆవేదనపై స్పందించిన ఎస్పీ కేసును బుక్కరాయసముద్రం పోలీసులకు బదిలీ చేశారు. మోసగాడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.  

Advertisement
Advertisement