Medical Student Dies By Suicide In Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad: ఎంబీబీఎస్‌ సీటు రాక బీఏఎంఎస్‌లో.. వాట్సాప్‌లో ఫ్రెండ్‌కు మెసేజ్‌ పెట్టి..

Published Thu, Jul 13 2023 2:09 AM

Medical student suicide - Sakshi

వెంగళరావునగర్‌ (హైదరాబాద్‌): మానసిక ఒత్తిడి కారణంగా ఓ మెడికల్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా విఠలాపూర్‌ గ్రామానికి చెందిన జి.డి మాణిక్యప్ప వ్యవసాయం చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జగదీశ్‌ (23)కు చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్‌ చదివి డాక్టర్‌ కావాలని కోరిక. ఈ క్రమంలో గత ఏడాది నీట్‌ ఎంట్రన్స్‌ రాశాడు. ఎంబీబీఎస్‌ సీటు రాకపోవడంతో ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్‌ మొదటి సంవత్సరంలో చేరాడు.

వెంగళరావునగర్‌ డివిజన్‌ జవహర్‌నగర్‌లో తన స్నేహితుడు ఫణీంద్రతో కలిసి రూం తీసుకుని ఉంటున్నాడు. బీఏఎంఎస్‌ చేయడం ఇష్టం లేకపోవడంతో కళాశాలకు కూడా సరిగా వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ నుంచి బీఏఎంఎస్‌ పరీక్షలు జరుగుతున్నట్టు నోటీసు వచ్చింది. జగదీశ్‌ సరిగా కళాశాలకు హాజరు కాలేకపోవడంతో హాల్‌ టికెట్‌ పొందేందుకు ఇబ్బంది ఎదుర్కొన్నాడు. తనకు హాల్‌ టికెట్‌ ఇవ్వరేమో, పరీక్షలు రాయడానికి వీలుపడదేమో అనుకుని ఒత్తిడికి గురయ్యాడు.

ఒకవైపు ఇష్టమైన ఎంబీబీఎస్‌ సీటు రాకపోవడం, మరోవైపు బీఏఎంఎస్‌ హాల్‌ టికెట్‌ ఇస్తారో లేదో అనే ఆందోళనతో జగదీశ్‌ మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఇదిలాఉండగా బుధవారం ఉదయం 7.30 గంటలకు జగదీశ్‌ రూంలో ఉంటున్న ఫణీంద్ర తన మరో స్నేహితుడైన రాజ్‌కుమార్‌ రూంకు వెళ్లాడు. జగదీశ్‌ 8.30 గంటల సమయంలో తన స్నేహితుడు అజయ్‌కు వాట్సాప్‌ ద్వారా తాను చనిపోతున్నట్టు మెసేజ్‌ పెట్టాడు. వెంటనే అజయ్‌ ఆందోళన చెంది ఫోన్‌ చేయగా, తాను చనిపోతున్నట్టు చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు.

హుటాహుటిన అజయ్‌ తన స్నేహితుడు నవీన్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే నవీన్, ఫణీంద్ర, ప్రశాంత్‌ కలిసి హుటాహుటిన జవహర్‌నగర్‌కు వచ్చి చూడగా గదిలో జగదీశ్‌ ఉరి వేసుకుని ఉన్నాడు. జగదీశ్‌ను ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని తండ్రి మాణిక్యప్పకు తెలియజేయడంతో ఆయన హుటాహుటిన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement