వ్యాక్సిన్‌ సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడి

25 May, 2021 12:23 IST|Sakshi
అధికారులను అడ్డుకుంటున్న మెయిల్‌ఖేడీ గ్రామస్తులు

భోపాల్‌: కరోనా వైరస్‌ నిరోధానికి తీసుకొచ్చిన వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఇంకా భయాందోళనలు.. అనుమానాలు తొలగడం లేదు. నిన్న ఉత్తరప్రదేశ్‌లో వ్యాక్సిన్‌కు భయపడి అందరూ సరయూ నదిలో దూకిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లో ప్రజలు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు వచ్చిన వైద్య అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. 

ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో వ్యాక్సిన్‌పై గ్రామస్తులకు సోమవారం అవగాహన కల్పించేందుకు అధికారులు వచ్చారు. గ్రామంలోకి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే అనారోగ్యం వస్తుందనే భావనలో గ్రామస్తులు ఉన్నారు. దీంతో వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులపై రాళ్లు, కర్రలు పట్టుకుని ఎదురుతిరిగారు.

ప్రాణభయంతో వైద్య సిబ్బంది తలో దిక్కు పారిపోయారు. గ్రామస్తుల దాడిలో ఓ పంచాయతీ అధికారిణి తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు బెదిరించి గ్రామం నుంచి వారిని వెళ్లగొట్టారు. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలోకి ప్రవేశించారు. అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. అధికారులపై గ్రామస్తుల దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

>
మరిన్ని వార్తలు