విషాదం: కొడుకు వీడియో తీస్తుండగానే..

22 Sep, 2020 12:20 IST|Sakshi
వృద్ధుడు దుర్గాప్రసాద్‌  

నా చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్‌ నోట్‌

తమ్ముడి కొడుకు వీడియో తీస్తుండగా దూకేశాడు

కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా)‌: తాడేపల్లి కనకదుర్గవారధి మీద ఓ వృద్ధుడు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తానంటూ చెప్పి అమాంతం కృష్ణానదిలో దూకి గల్లంతైన ఘటనపై తాడేపల్లి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గల్లంతైన యం.దుర్గాప్రసాద్‌ తమ్ముడి కొడుకు సుదీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి అయిన దుర్గాప్రసాద్, ఆయన స్నేహితులు ముగ్గురు, కొడుకు వరసైన సుదీప్‌ తాడిగడప నుంచి కనకదుర్గవారధిపైకి వచ్చి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు కుంకుమ, పసుపు, పూలు చల్లుదామని మొదట అందరూ కలిసి కృష్ణానదిలో చేతిలో పట్టుకున్న పూజా సామగ్రిని వదిలిపెట్టినట్లు తెలిపాడు.

అనంతరం పెదనాన్న అయిన దుర్గాప్రసాద్‌ నేను ఒక్కణ్ణే పూజ చేస్తాను, వీడియో తియ్యి అంటూ చెప్పి తన జేబులో ఉన్న సూసైడ్‌ లెటర్‌ను, మిగతా వస్తువులను, సెల్‌ఫోన్‌ను కొడుక్కు ఇచ్చి పూలు చల్లుతూ వీడియో తీస్తుండగానే అమాంతం కృష్ణానదిలోకి దూకినట్లు తెలియజేశాడు. సూసైడ్‌నోట్‌లో “నా చావుకు ఎవరి ప్రమేయం లేదు. నాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చనిపోతున్నాను. నా తమ్ముడు అడ్రస్‌ మన్నె జనార్ధనరావు, తాడిగడప, విజయవాడ’అని రెండు ఫోన్‌ నంబర్లు రాసి, సంతకం పెట్టి ఉంది.  తాడేపల్లి పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు