రెప్పవాలితే చాలు! | Sakshi
Sakshi News home page

రెప్పవాలితే చాలు!

Published Sat, Mar 9 2024 3:53 AM

Ongoing research into accident prevention - Sakshi

రహదారులపై మృత్యుఘోష 

డ్రైవర్లు, ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న నిద్రమత్తు 

హైవేలు, కీలక మార్గాల్లో దీనివల్లే 40% ప్రమాదాలు 

సుదీర్ఘ ప్రయాణాలు, విశ్రాంతి లేకపోవడంతో అలసట 

ప్రమాదాల నివారణకు సాగుతున్న పరిశోధనలు 

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో అల్వాల్‌ వెంకటాపురానికి చెందిన నవ దంపతులు బాల కిరణ్, కావ్య సహా ఐదుగురు.. ఉత్తరాంధ్రలోని కాశీబుగ్గ వద్ద చైతన్యపురికి చెందిన వేదవతి, వెంకటయ్య..ఇలా ఎందరో డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘ ప్రయాణం, తగినంత విశ్రాంతి లేకుండా వాహనాలు నడపడం వల్ల నిద్ర మత్తులోకి జారుకుంటున్న డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు.

ఏటా లక్షలాది మంది డ్రైవర్లు, ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం నిద్రమత్తు వల్లే చోటు చేసుకుంటున్నాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా డ్రైవర్ల పని వేళలకు సంబంధించిన చట్టం అమలు కావడంతో పాటు సాంకేతికంగానూ అనేక మార్పులు వస్తేనే ఈ ప్రమాదాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.  

అలసటే ప్రధాన కారణం 
దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులు..అలాగే హైదరాబాద్‌లోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వంటి కీలక రోడ్లపై ప్రయాణించే వాహనాల్లో అత్యధికం ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలకు చెందినవే అయినప్పటికీ.. వ్యక్తిగత రవాణా వాహనాలు, ప్రైవేటు వాహనాలు సైతం పెద్ద సంఖ్యలోనే రాకపోకలు సాగిస్తుంటాయి.

నిత్యం సుదూర ప్రాంతాల నుంచి గమ్య స్థానాలకు సరుకు రవాణా చేసే వాహనాల డ్రైవర్లకు అవసరమైన విశ్రాంతి ఉండదు. ఎన్ని ట్రిప్పులు ఎక్కువ వేయిస్తే అంత ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే ధోరణితో యాజమాన్యాలు పని చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతుంటాయి. రిలీవర్‌ రాకపోవడం, ఇతరత్రా కారణాలతో విశ్రాంతి ఇవ్వకుండా పని చేయిస్తుంటాయి.

ఇక వివిధ పనులపై వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే వారు సైతం వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలనుకుంటారు. త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోవాలనుకుంటారు. తగినంత విశ్రాంతి లేకుండా వేగంగా డ్రైవ్‌ చేస్తుంటారు. అలసటతో నిద్రమత్తుకు గురై వాహనంపై నియంత్రణ కోల్పోతారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టునో, నిలిపి ఉంచిన లారీ లాంటి ఏ భారీ వాహనాన్నో ఢీకొట్టేస్తారు. ఇలాంటి ఘటనల్లో ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.  

రోడ్డు పక్కన ఆపినా.. 
జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లలో కొందరు కాస్త అలసట తీర్చుకుందామనో, టీ తాగుదామనో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఉంచడం ప్రమాదాలకు కారణమవుతోంది. డ్రైవర్లు తామ వాహనాలను పార్కింగ్‌ చేసుకుని సేద తీరేందుకు అవసరమైన స్థలాలు అన్నిచోట్లా అందుబాటులో ఉండట్లేదు. చాలావరకు దాబాలు, రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకుల వద్దే వీరు తమ వాహనాలను ఆపి ఉంచుతున్నా.. మరికొందరు వెంటనే వెళ్లిపోదామనో, ఇతరత్రా కారణాలతోనో రహదారికి పక్కగానే ఆపుతున్నారు.

ఇది అనేక సందర్భాల్లో ఎదుటి వారికి, కొన్నిసార్లు వారికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ వాహనాలు సరిగా కనబడక పోవడం, అలసట, నిద్రావస్థలో ఆదమరిచి ఉండటం లాంటి కారణాలతో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీ కొంటున్నాయి. బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద నిలుపుతున్న సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారులపై తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను పోలీసులు గుర్తిస్తుంటారు. వీటినే సాంకేతిక పరిభాషలో బ్లాక్‌స్పాట్స్‌ అంటారు. ఇలాంటి బ్లాక్‌స్పాట్స్‌ హైవేలపై ఎక్కువగా ఉంటున్నాయి.  

ఎంవీ యాక్ట్‌ ఏం చెబుతోందంటే... 
ప్రతి రవాణా వాహనంలో డ్రైవర్‌తో పాటు ఖచ్చి­తంగా కో–డ్రైవర్‌ ఉండాలని మోటారు వాహనాల చట్టం స్పష్టం చేస్తోంది. డ్రైవర్లు రోజుకు కేవలం పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలి. డ్రైవర్‌ విధులు నిర్వర్తించే ఎనిమిది గంటల కాలంలో ఖచ్చితంగా రెండు గంటల విశ్రాంతి ఉండాలి. తన వాహనం ద్వారా ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఆ సమా­చారాన్ని పోలీసులకు తెలిపి తీరాలి.

రహదారుల పక్కన నిర్దేశిత ప్రాంతాల్లో మినహా ఎక్కడా వాహనాలను పార్క్‌ చేయకూడదు. ఈ నిబంధనలు కేవలం రవాణా వాహనాలకే కాదు.. వ్యక్తిగత వాహనాల డ్రైవర్లకూ వర్తిస్తాయి. అయితే ఇవి ఎక్కడా అమలుకాని కారణంగానే హైవేలు, ఇతర మార్గాలపై ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయని నిపుణులు అంటున్నారు.  

ప్రమాదాల నివారణకు పరిశోధనలు 
ఏటా లక్షల మందిని మింగుతున్న కారు ప్రమాదాల నివారణకు ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్‌ సంస్థలు దశాబ్దాలుగా ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. వీటి ఫలితంగానే 1948లో రోడ్‌ గ్రిప్, ఆ తర్వాత రేడియల్‌ గ్రిప్‌ టైర్లు అందుబాటులోకి వచ్చాయి. 1958లో ఓల్వో కంపెనీ సీటుబెల్ట్‌ను కనుగొంది. తర్వాత ఎయిర్‌ బ్యాగులూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రధానంగా మూడు అంశాలపై ఆటోమొబైల్‌ కంపెనీల పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి కూడా సాకారమైతే కారు ప్రమాదాలకు దాదాపు ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చని మోటారు వాహన రంగ నిపుణులు చెప్తున్నారు. 

ఆటో బ్రేకింగ్‌  
ముందున్న వాహనాలు/వస్తువులు కారుకు సమీపంలోకి రాగానే కారులో ఉండే సెన్సర్లు పని చేస్తాయి. బ్రేకులు వాటంతట అవే పడేలా చేస్తాయి. ఈ టెక్నాల జీ ప్రస్తుతం స్వీడన్‌లో ప్రయోగాల దశలో ఉంది. 

ఇంటెలిజెంట్‌ విండ్‌ స్క్రీన్‌  
డ్రైవర్‌ కారు నడిపేప్పుడు అతడు నిద్రలో జోగకుండా, అతని దృష్టి మళ్లకుండా ఇది ఉపకరిస్తుంది. డ్రైవర్‌ సరిగా చూస్తున్నాడా? ఎటు చూస్తున్నాడనే దాన్ని గమనిస్తూ అప్రమత్తం చేస్తుంది. రోడ్ల అంచులు, వాహనం స్థితి తదితరాలను సూచిస్తుంది. 

క్రాష్‌ టెస్ట్‌ డమ్మీ 
కారు నడిపే వ్యక్తి పర్సనాలిటీ ఆధారంగా ఎక్కడ ఢీ కొంటే ఏ అవయవాలు దెబ్బతింటాయి అనేది నిర్థారిస్తుంది. ఇప్పటికే 100కు పైగా నమూనాలు రూపొందించిన ఈ టెక్నాలజీతో వ్యక్తికి తగ్గట్టుగా భద్రతా ప్రమాణాలను కారులో ఏర్పాటు చేసేందుకు వీలుగా పరిశోధనలు సాగుతున్నాయి. 

మానవ తప్పిదాలను నివారించాలి 
వాహనం ఎంతటి భద్రతా ప్రమాణాలతో కూడినదైనా, ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అతి ఎక్కువగా ప్రమాదాలకు కారణమయ్యే మానవ తప్పిదాలను నివారించకపోతే ఫలితం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరిగా రాకపోయినా వాహనం నడపడం, హైవే డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగం, వాహనాన్ని అదుపు చేయలేక పోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్‌ ధరించడంలో నిర్లక్ష్యం వహించడం లాంటివి నివారిస్తేనే ఏ టెక్నాలజీతోనైనా పూర్తి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.  

Advertisement
Advertisement