స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత

22 Oct, 2021 07:50 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): పొల్లాచ్చి కేసులో నిందితులకు అండగా ఖాకీలు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. వీడియో వైరల్‌ కావడంతో ఓ స్పెషల్‌  ఎస్‌ఐతో సహా ఏడుగురిని గురువారం సస్పెండ్‌ చేశారు. మాయ మాటలతో, స్నేహం ముసుగులో విద్యార్థినులను, యువతులను బలవంతంగా లొంగ దీసుకోవడమే కాదు, ఆ దృశ్యాల్ని కెమెరాల్లో బంధించి, తరచూ బెదిరిస్తూ వారి  జీవితాలతో చెలాగాటం ఆడుతూ వచ్చిన మృగాళ్ల బండారం పొల్లాచ్చిలో  వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాధితులు అనేక మంది గతంలో చేసిన  ఫిర్యాదుతో మృగాళ్ల తిరునావుక్కరసు, శబరినాథన్, మణివణ్ణన్, వసంతకుమార్, సతీష్‌ తొలుత అరెస్టు అయ్యారు. కేసు సీబీఐ చేతికి వెళ్లినానంతరం అన్నాడీఎంకేకు చెందిన అరులానందన్, బాలు, బాబు పట్టుబడ్డారు. ఈ కీచకుల్లో ఐదుగురు సేలం జైల్లో, మరో ముగ్గురు గోబి చెట్టి పాళయం జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. 

మార్గం మధ్యలో సపర్యలు
బుధవారం వీరిని కేసు విచారణ నిమిత్తం కోయంబత్తూరు కోర్టుకు హాజరు పరిచారు. సేలం జైల్లో ఉన్న ఐదుగుర్ని ఎస్‌ఎస్‌ఐ సుబ్రమణ్యంతో పాటుగా ఏడుగురు పోలీసులు వ్యానులో కోర్టుకు తీసుకొచ్చారు. రిమాండ్‌ పొడిగించినానంతరం వీరిని మరలా జైలుకు తరలించారు.అయితే, మార్గం మధ్యలో ఈ కీచకులకు అండగా భద్రతకు వెళ్లిన పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో అర్ధరాత్రి వేళ వైరల్‌గా మారింది. గోల్డెన్‌ట్విన్స్‌ షూటింగ్‌స్పాట్‌ వద్ద పోలీసుల వాహనం ఆపేశారు. కీచకులు వారి కుటుంబీకులు, బంధువులు వారితో ముచ్చటించడమే కాకుండా, కోర్టు సమర్పించిన చార్జ్‌షీట్‌ నకలు వారి చేతికి చేరింది.

అర్ధగంటకు పైగా కుటుంబంతో నిందితులు గడిపిన వీడి యో వెలుగులోకి రావడంతో పోలీసు బాసులు స్పందించారు. ఎస్‌ఐ సుబ్రమణ్యంతో పాటుగా ఏడుగురు పోలీసుల్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కీచకులు, వారి కుటుంబాలతో భద్రతకు వెళ్లిన వారికి ఉన్న సంబంధాలు, వారి నుంచి వీరికి ఏ మేరకు నగదు ముట్టిందో.. అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో సీబీఐ సైతం సస్పెండైన ఏడుగురి మీద గురి పెట్టడం గమనార్హం.  

మరిన్ని వార్తలు