మరో పరువు హత్య కలకలం!

7 Oct, 2020 14:26 IST|Sakshi

పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో తండ్రీకొడుకుల ఉన్మాదం

లక్నో : హత్రాస్‌ జిల్లాలో దళిత యువతి హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన 16 ఏళ్ల దళిత బాలిక పరువు హత్య కలకలం రేపింది. షహజన్‌పూర్‌ జిల్లాలో బాలికను స్వయంగా ఆమె తండ్రి, సోదరుడు కిరాతకంగా హత్య చేశారు. బాలిక తీరుతో కుటుంబం పరువు మంటగలిసిందనే ఆక్రోశంతో ఆమెను తండ్రి, సోదరుడు దారుణంగా కొట్టి చంపారు. సెప్టెంబర్‌ 23న బాలిక అదృశ్యం కాగా, మంగళవారం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. బాలికను తీవ్రంగా హింసించి గొంతు కోసి చంపినట్టు నివేదికలు వెల్లడించాయి.

ఆపై బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి నది ఒడ్డున ఖననం చేశారని పోలీసులు వెల్లడించారు. కాగా దళిత బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించగా సోదరుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాలిక గర్భం దాల్చడంతో ప్రజలు తనను అవమానిస్తున్నారని, ఈ ఆక్రోశంతోనే కన్నబిడ్డను చంపుకున్నానని తండ్రి తన నేరాన్ని అంగీకరించాడు. హత్యలో పాలుపంచుకున్న బాలిక సోదరుడు పరారీలో ఉన్నాడని ఇద్దరిపై హత్యా నేరం మోపి దర్యాప్తు చేపట్టామని షహజన్‌పూర్‌ ఎస్‌ఎస్పీ ఎస్‌.ఆనంద్‌ వెల్లడించారు. బాలిక హత్యలో తల్లి, ఇతర బంధువులనూ ప్రశ్నించామని ఈ ఘటనలో వారి ప్రమేయం నిర్ధారణ కాలేదని చెప్పారు. బాలిక ఎన్నడూ స్కూలుకు వెళ్లలేదని, ఓ బంధువు వద్ద ఉండేదని కుటుంబ సభ్యలు తెలిపారని పోలీసులు చెప్పారు. మైనర్‌ బాలికతో లైంగిక సంబంధాలు నేరమని దీనికి కారకులెవరైనా విడిచిపెట్టమని పోలీసులు పేర్కొన్నారు. చదవండి : హథ్రాస్‌ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు