Fathima Murder Case: Two arrested in Vijayawada - Sakshi
Sakshi News home page

‘రైల్‌ టికెట్‌’తో చిక్కిన హంతకులు: సంచలనం రేపిన ‘ఫాతిమా’ కేసు

Published Wed, Aug 11 2021 9:08 AM

Revealing Fathima Assassination Case Mystery: Railway Ticket Played Key Role - Sakshi

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): ‘మానసికంగా కుంగిపోయిన యువతిని తిరిగి ఆరోగ్యవంతురాలిని చేస్తానని ఓ భూత వైద్యుడు నమ్మించి ఢిల్లీ రప్పించుకున్నాడు. తన వద్దకు చేరిన యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి సన్నిహితంగా మెలిగాడు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు మొదటి భార్య అడ్డు చెప్పడంతో వదిలించుకునేందుకు స్నేహితుడి సాయంతో నదిలోకి తోసి హత్యచేశాడు. అయితే తన కుమార్తె అదృశ్యమైందని యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, రైలు టికెట్‌ ఆధారంగా కేసును ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

వెస్ట్‌ జోన్‌ ఇన్‌చార్జి డీసీపీ కె.బాబూరావు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చిట్టినగర్‌కు చెందిన నజీర్‌ అహ్మద్‌ తన కుమార్తె ఫాతిమా అనారోగ్యానికి గురవడంతో ఉత్తరప్రదేశ్‌ లోని షహరానాపూర్‌కు చెందిన భూతవైద్యుడు మహ్మద్‌ వాసిఫ్‌ను విజయవాడకు పిలిపించాడు. అతను పది రోజులు నగరంలో ఉండి ఫాతిమాకు భూతవైద్యం చేశాడు. అనంతరం అతను స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొద్ది కాలం తరువాత ఫాతిమా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో నజీర్‌ అహ్మద్‌ తన కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

బుక్‌ చేసిన రైల్‌ టికెట్టే పట్టించింది..
ఫాతిమా అదృశ్యం కేసు పూర్వాపరాలను పరిశీలించిన కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి యువతి వినియోగించిన సెల్‌ఫోన్‌ను చివరి సారి ఎక్కడ వాడోరో గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఫోన్‌ కాల్‌డేటా, మెసేజ్‌లను పరిశీలించారు. యువతి సెల్‌ఫోన్‌కు ఢిల్లీకి వెళ్లేందుకు రైల్వే టికెట్‌ను బుక్‌ చేసినట్లు మెసెజ్‌ను గుర్తించారు. ఆ టికెట్‌ను భూతవైద్యుడు మహ్మద్‌ వాసిఫ్‌ బుక్‌చేశాడని తేల్చారు. దీంతో ఫాతిమా కేసులో పురోగతి వచ్చింది. ఢిల్లీకి వెళ్లిన ఫాతిమాను మహ్మద్‌ వాసిఫ్, అతని స్నేహితుడు మహ్మద్‌ తయ్యద్‌ తమ స్వగ్రామైన షహరానాపూ ర్‌కు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాసిఫ్‌ కొద్ది రోజుల పాటు ఫాతిమాతో సన్నిహితంగా ఉండటంతోపాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

ఈ విషయం వాసిఫ్‌ భార్యకు తెలియడంతో ఆమె గొడవ చేసింది. దీంతో పెళ్లి కుదరదని వెంటనే ఢిల్లీ వెళ్లిపోవాలని వాసిఫ్‌ ఫాతిమాకు చెప్పాడు. ఆమె మాట వినకపోవడంతో బైక్‌పై మీర్జాపూర్‌ సమీపంలోని హత్నికుండ్‌ డ్యామ్‌ వద్దకు తీసుకెళ్లాడు. స్నేహితుడు తయ్యద్‌ సాయంతో నదిలోకి తోసేశాడు. ఆమె మృతదేహం ఇటీవల బయటపడింది. రైల్‌ టికెట్‌ ఆధారంగా కేసు దర్యాప్తు కోసం షహరానాపూర్‌కు వెళ్లిన కొత్తపేట పోలీసులు కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించారు. హత్య కేసులో ప్రధాన నిందితులు మహ్మద్‌ వాసీఫ్‌(30), మహ్మద్‌ తయ్యద్‌(29) అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మీడియా సమావేశంలో వెస్ట్‌ ఏసీపీ హనుమంతరావు, కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement