రోడ్డు ప్రమాదంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ గోపాల్‌రెడ్డి దుర్మరణం

30 Sep, 2022 08:15 IST|Sakshi

సాక్షి,అమరావతి/ తిరుమల: రాయల సీమాంధ్ర వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్‌ జర్నలిస్ట్, తిరుపతి పట్టణానికి చెందిన మబ్బు గోపాల్‌రెడ్డి(75) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను కవర్‌ చేసేందుకు తిరుమల వచ్చిన గోపాల్‌రెడ్డి బుధవారం రాత్రి బైక్‌పై తిరిగి తిరుపతికి వెళుతుండగా మొదటి ఘాట్‌ రోడ్డులోని 12వ మలుపు వద్ద కిందపడి రక్షణ గోడను ఢీకొట్టారు.
చదవండి: గాడ్‌ఫాదర్‌ ఈవెంట్‌.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?  

తీవ్రంగా గాయపడిన ఆయనను తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. పలు ప్రముఖ దిన పత్రికల్లో పనిచేసిన గోపాల్‌రెడ్డి.. ప్రస్తుతం యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్నారు. ఆయన మృతి పట్ల టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

సంతాపం తెలిపిన సజ్జల  
సీనియర్‌ జర్నలిస్ట్‌ మబ్బు గోపాలరెడ్డి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. గోపాలరెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు