ఇజ్రాయెల్‌ నుంచి ఎలా వచ్చాయి? | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ నుంచి ఎలా వచ్చాయి?

Published Sat, Mar 23 2024 6:14 AM

Sixth Day Of Praneeth Rao Police Investigation Over Phone Tapping case: ts - Sakshi

అత్యాధునిక ఉపకరణాల దిగుమతికి కేంద్రం అనుమతి తప్పనిసరి

 ‘ఎస్‌ఐబీ సైన్యం’ తీసుకుంది సక్రమమేనా?  

సమాచారం ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలే! 

అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌  

ఆరో రోజు ముగిసిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు విచారణ 

సాక్షి, హైదరాబాద్‌: అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ‘టి.ప్రభాకర్‌రావు అండ్‌ టీమ్‌’ఇజ్రాయెల్‌ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఉపకరణాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఏ) అనుమతి ఉందా? లేదా? అనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. వీటిని ఖరీదు చేయడానికి ఏ బడ్జెట్‌ నుంచి నిధులు వెచ్చించారనేదిపై కూడా స్పష్టత లేదు. మరోపక్క సిట్‌ కస్టడీలో ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును అధికారులు ఆరో రోజైన శుక్రవారం ప్రశ్నించారు. ఈయన పోలీసు కస్టడీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల కస్టడీ కోరాలా? వద్దా? అనే దానిపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.  

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటాయి  
ఉగ్రవాదులు, మావోయిస్టులపై నిఘా, ఆపరేషన్లు చేయడానికి ప్రతీరాష్ట్రం ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేసుకుంటాయి. రాష్ట్రంలో మావోయిస్టులపై నిఘాకు ఎస్‌ఐబీ, ఉగ్రవాదుల కదలికలపై కన్నేసి ఉంచడానికి కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ పనిచేస్తుంటాయి. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లకు
గ్రేహౌండ్స్, ఉగ్రవాదులపై పోరాడటానికి ఆక్టోపస్‌ ఉన్నాయి. ఈ విభాగాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్, అప్‌గ్రేడ్‌ అవుతాయి. దీనికోసం దేశవిదేశాల్లో అందుబాటులోకి వచి్చన అత్యాధునిక పరికరాలు, ఉపకరణాలను ఖరీదు చేస్తాయి. కొన్నింటిని దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న లైసెన్డ్స్‌ ఏజెన్సీల నుంచి, మరికొన్ని కన్సల్టెంట్స్‌ ద్వారా విదేశాల నుంచి కొనుగోలు చేస్తాయి. ఇది అన్ని విభాగాల్లోనే జరిగే నిరంతర ప్రక్రియే. 

అయితే అనుమతి లేదా సమాచారం  
శాంతిభద్రతల పరిరక్షణ అనేది రాష్ట్రపరిధిలోని అంశమే. దీంతో భద్రతాపరమైన ఏర్పాట్లకు రాష్ట్ర పోలీసు, నిఘా విభాగాలు కొన్ని ఉపకరణాలను సమీకరించుకుంటాయి. అయితే వీటికి సంబంధించిన సమాచారం మొత్తం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు తెలియాల్సిందే. ఈ విషయంలో రాష్ట్రాలు రెండు విధానాలను పాటిస్తాయి. అత్యవసరమైనప్పుడు దేశంలోని వివిధ ఏజెన్సీల నుంచి ఉపకరణాలను ఖరీదు చేస్తాయి. ఆపై పోస్ట్‌ ఫ్యాక్టో విధానం అనుసరిస్తూ  కేంద్ర హోంమంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఏ)కు సమాచారం ఇస్తాయి. విదేశాల నుంచి ఏదైనా దిగుమతి చేసుకోవాలంటే దానికి కొంత సమయం ముందు నుంచే కసరత్తు మొదలవుతుంది. ఇది అత్యవసరంగా జరిగేది కాదు. దీంతో కచి్చతంగా ముందు అనుమతి తీసుకోవాల్సిందే. బ్యూరో ఆఫ్‌ పోలీసు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌అండ్‌డీ) ద్వారా ఎంహెచ్‌ఏలో ఉండే స్పెషల్‌ సెక్రటరీ (ఇంటర్నల్‌ సెక్యూరిటీ) నుంచి అనుమతి పొందాలి. ట్యాపింగ్‌ వంటి ఉపకరణాలు, పరికరాలు విషయంలో ఇది తప్పనిసరిగా అమలు కావాల్సిందే.  

నిధుల విషయంలో ఏదీ స్పష్టత
ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, రియల్టర్లు తదితరులను టార్గెట్‌ చేయడానికి 2018లో ఎస్‌ఐబీ ఇజ్రాయెల్‌ నుంచి అత్యాధునిక ఉపకరణాల ఖరీదుకు ముందు కేంద్రం నుంచి అనుమతి, పోస్ట్‌ ఫ్యాక్టో సమాచారం ఇచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇలాంటివి ఏమీ లేకుండా అక్రమంగా ట్యాపింగ్‌ ఉపకరణాలను దిగుమతి చేసుకుంటే బాధ్యులపై ఎంహెచ్‌ఏ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నారు. మరోపక్క వీటిని ఖరీదు చేయడానికి ఏ నిధులు వాడారు? ఎంత వెచ్చించారు? తదితర అంశాలను లోతుగా ఆరా తీస్తున్నారు. ఎంహెచ్‌ఏకు చెందిన ఓ మాజీ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘సాధారణంగా ఇలాంటివి అక్రమంగానే దిగుమతి అవుతాయి. రాజకీయ పార్టీల ప్రోద్బలంతో విదేశాల్లో ఉన్న వారి సానుభూతిపరుల నుంచి నిధులు సమీకరిస్తారు. అలా వచ్చిన డబ్బుతో వీటిని కొంటారు. రాష్ట్రంలో ఉన్న డమ్మీ కంపెనీల పేర్లతో, వాటికి సంబంధించిన ఉపకరణాలని చెబుతూ దిగుమతి చేసుకుంటారు. వివాదాస్పదమైనప్పుడే వీటిపై దృష్టి పడుతుంది’అని వివరించారు.  

మీడియా చానల్‌ అధినేత ఇంట్లో సోదాలు
ఎస్‌ఐబీ కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఉచ్చు ఓ మీడియా చానల్‌ అధినేతకు చుట్టుకుంది. మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం రాత్రి సిట్‌ అధికారులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.78లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత ఈ మీడియా అధినేత అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది.

ఇతడికి ప్రణీత్‌రావుకు మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్లు ఇప్పటికే సిట్‌కు లభించాయి. ఎన్నికల నేపథ్యంలో రాజకీయనేతల ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన ప్రణీత్‌కు ఈ మీడియా అధినేత సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యక్తి అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, వీరికి అండగా నిలుస్తున్న వారి వివరాలను తన నెట్‌వర్క్‌ ద్వారా సేకరించి ప్రణీత్‌కు అందించారు. అక్రమ ట్యాపింగ్‌ ఉపకరణాన్ని ప్రణీత్‌రావు కొన్ని రోజులు ఈ మీడియా చానల్‌లో ఉంచి కథ నడిపిట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క వీరు బెదిరింపులు,  వసూళ్లకు పాల్పడినట్టు సిట్‌ ఆధారాలు సేకరించింది.

Advertisement
Advertisement