Sakshi News home page

రీల్‌ కాదు.. ‘కాల్‌’ నాయక్‌!

Published Wed, Mar 27 2024 4:52 AM

Some call based on information gathered by the taping team - Sakshi

నాయక్‌ సినిమాలోలా వ్యవహరించిన శివారు కమిషనరేట్‌ ఉన్నతాధికారి 

ట్యాపింగ్‌ టీమ్‌ సేకరించిన సమాచారం ఆధారంగా కొందరికి పిలుపులు 

విడివిడిగా సమావేశాలు ఏర్పాటు.. రియల్టర్లు, బిల్డర్ల నుంచి వసూళ్లు

సాక్షి, హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేసిన ‘నాయక్‌’ అనే సినిమాలో.. నాయక్‌ భాయ్‌గా మారిన కథానాయకుడు ఆ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తుల్ని, రౌడీలను పిలిచి ఓ మీటింగ్‌ పెడతాడు. వారిని భయపెట్టి, దండించి వారు చేసిన నేరాలు, అలాగే వారు సంపాదించిన ఆస్తుల వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత కొన్ని పత్రా లపై సంతకాలు చేయించడం ద్వారా వారి స్థిర చరాస్తులు అనాథాశ్రమాలకు చెందేలా చేస్తాడు.

ఇందుకోసం ఓ స్పెషల్‌ టీమ్‌ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రీల్‌ సీన్‌తో కొన్ని సారూప్యతలు ఉన్న రియల్‌ సీన్‌ ఒకటి గతంలో హైదరా బాద్‌ శివార్లలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శివారు కమిషనరేట్‌ అప్పటి ఉన్నతాధికారి.. ఓ పార్టీకి విరాళాలు సేకరించి ఇచ్చేందుకు ఈ తరహా పద్ధతిని అనుసరించారు.

నేను సైతం.. అనుకున్న ఈయన కూడా స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) నుంచి అందిన ఫోన్‌ ట్యాపింగ్‌ రికార్డుల్ని ఆధారంగా చేసుకున్నారు. పలువురు వ్యాపారు లను వేర్వేరుగా తమ ప్రాంతానికి పిలిపించారు. ఎవరి రికా ర్డులు వారికి వినిపించి ‘కప్పం’ కట్టేలా చేశారు. ఇందులో ఓ అధికారి నేతృత్వంలోని స్పెషల్‌ టీమ్‌ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీనిపై సిట్‌ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారని సమాచారం. 

టార్గెట్లు నిర్దేశించి మరీ..
ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో ఓఎస్డీలుగా పని చేసిన టి.ప్రభా కర్‌రావు, పి.రాధాకిషన్‌రావు ట్యాపింగ్‌లో వెలుగులోకి వచ్చి న అంశాల ఆధారంగా బెదిరింపు వసూళ్లకు, విరాళాల సేకరణకు తెగబడినట్టుగా సిట్‌ ఇప్పటికే గుర్తించింది. ఓపక్క వీరి వ్యవహారాలు ఇలా సాగుతుండగా.. శివారు ప్రాంత కమిషనరేట్‌ ఉన్నతాధికారి కూడా తన వంతుగా ఎంతోకొంత చేయాలని భావించారు. ప్రభాకర్‌రావు నుంచి తనకు అందిన ట్యాపింగ్‌ రికార్డులను విశ్లేషించి, అవతలి వ్యక్తులను సంప్రదించడానికి వీలుగా స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశా రు.

వీరిలో ఫార్మా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లతో పాటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు చెందిన వాళ్లూ ఉన్నట్టు సమాచారం. కాగా స్పెషల్‌ టీమ్‌కు నేతృత్వం వహించిన అధికారి తన సిబ్బందితో ఆయా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లు నిర్దేశించిన సమయాల్లో మీటింగ్‌కు వచ్చేలా ఒత్తిడి చేసేవారు. ఇలా వచ్చిన వారితో సమావేశమయ్యే శివారు ఉన్నతాధికారి ట్యా పింగ్‌ ఆడియోలను వినిపించే వారు.

అందులోని సున్నిత, వ్యక్తిగత అంశాలు ప్రస్తావించి వాళ్లు ఇవ్వాల్సిన మొత్తానికి సంబంధించి టార్గెట్లు ఇచ్చేవారు. వారు ఎప్పుడు? ఎలా? ఎవరికి? ఆయా మొత్తాలు చెల్లిస్తారో అప్పటికప్పుడే తెలుసు కునేవారు. ఇక వారి వెంటపడి వసూలు చేసే బాధ్యతల్ని స్పెషల్‌ టీమ్‌ ఇన్‌చార్జికి అప్పగించేవారు. కాగా ఇలా వసూ లైన మొత్తం ఓ పార్టీకి విరాళంగా అందినట్లు సమాచారం.

తిరుపతన్నకు ‘ద్వితీయ శ్రేణి’ బాధ్యతలు
నాటి ప్రతిపక్ష నేత, ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరు కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్‌ను ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ప్రణీత్‌రావు టీమ్‌ చేపట్టింది. అయితే ప్రతిపక్ష నేత లేదా ఆ స్థాయిలో ప్రాధాన్యం లేని, ద్వితీయ శ్రేణికి చెందిన వారి నంబర్లు ట్యాప్‌ చేసే బాధ్యతల్ని తిరుపతన్న తన బృందంతో కలిసి నిర్వర్తించినట్లు సిట్‌ చెప్తోంది.

ఆ వ్యక్తుల్ని, వారి నంబర్లు గుర్తించే బాధ్యతల్ని టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న పి.రాధాకిషన్‌రావు నిర్వర్తించారు. తన టీమ్‌ ద్వారా ఇతర మార్గాల్లో వివరాలను సేకరించే ఈయన, వాటిని తిరుపతన్నకు అందించేవారు. వీటిపై ప్రభాకర్‌రావుకు సమాచారం ఇచ్చే తిరుపతన్న ట్యాపింగ్‌ రికార్డులను కూడా ప్రభాకర్‌రావుకే అందించేవారని తెలిసింది.

ప్రాథమిక విచారణలోనే ఈ విషయం గుర్తించిన సిట్‌ అధికారులు తిరుపతన్న నేరాంగీకార వాంగ్మూలంలోనూ దాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీమ్‌ గత ఏడాది కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడి కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్లు సమాచారం. దీనికోసం కొన్నాళ్లు బెంగళూరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి వచ్చినట్లు తెలిసింది. 

పరిచయస్తులకు ప్రభాకర్‌రావు ఫోన్లు!
ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు తనకు పరిచయం ఉన్న పలువురు అధికారులకు ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. ట్యాపింగ్‌ వ్యవహారంలో తన ఒక్కడినే బాధ్యుణ్ణి ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారని సమాచారం. ట్యాపింగ్‌ జరిగిన సమయంలో తాను రెగ్యులర్‌ అధికారిని కాదని, పద వీ విరమణ తర్వాత ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ) మాత్రమే అని చెప్తున్నట్లు సమాచారం.

తాను ఓఎస్డీగా ఉన్న సమయంలో నిఘా విభాగాధిపతు లుగా పని చేసిన అదనపు డీజీలు, అప్పటి డీజీపీలు సైతం బాధ్యులే అని, వారికి తెలిసే ఎస్‌ఐబీ కేంద్రంగా వ్యవహారా లు సాగినట్లుగా వాదిస్తున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ప్రణీత్‌ రావు, భుజంగరావు, తిరుపతన్నల్ని తదుపరి విచారణ నిమిత్తం 5 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

పుత్రరత్నం లీలలు..
ట్యాపింగ్‌ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి, తన హవా చెలాయించిన ఉన్నతాధికారి పుత్రరత్నం లీలలు తాజాగా బయటకు వస్తున్నాయి. తన తండ్రి పలుకుబడిని వినియోగించి ఇతను తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నట్లు తెలు స్తోంది. అంతేకాకుండా శివారు పోలీసులకు మన‘శ్శాంత్‌’ లేకుండా చేసినట్లు సమాచారం. నగరం వెలుపల ఇతను ఓ ఫామ్‌హౌస్‌ ఏర్పాటు చేసుకోగా.. అక్కడి నిర్మాణాలు, జనరేటర్‌తో పాటు నాటిన మొక్కలు సైతం పోలీసుల ‘సౌజన్యమే’ అని తెలుస్తోంది.

ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ పుత్రరత్నం తండ్రికి ఫోన్‌ చేసి చెప్పేవాడు. ఆయన తన కార్యాలయం ల్యాండ్‌ లైన్‌ నుంచి ఏదో ఒక పోలీసు అధికారికి ఫోన్‌ చేసి, తన కుమారుడు ఫోన్‌ చేస్తాడని చెప్పేవారు. ఆ తర్వాత వారికి ఫోన్‌ చేసే సుపుత్రుడు తన డిమాండ్‌ చెప్పి పీడించి మరీ నెరవేర్చుకునేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతడికి ఓ డీఎస్పీ స్థాయి అధికారి షాక్‌ ఇచ్చాడని తెలిసింది.

ఈయనకు ఫోన్‌ చేసిన సుపుత్రుడు ఐదు జేసీబీలు, ఐదు టిప్పర్లు ఫామ్‌హౌస్‌ వద్దకు పంపాలంటూ హుకుం జారీ చేశారని, దీంతో ఆ డీఎస్పీ ‘డబ్బు ఎవరు ఇస్తారు? ఎంత డిస్కౌంట్‌ కావాలి?’ అంటూ ప్రశ్నించడంతో ఫోన్‌ పెట్టేశారని సమాచారం.

Advertisement
Advertisement