తండ్రి మరణాన్ని తట్టుకోలేక..

12 Aug, 2020 12:18 IST|Sakshi
సోమనర్సయ్య (ఫైల్‌) 

తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. కుమారుడి హఠాన్మరణం

శాలిగౌరారం మండల కేంద్రంలో విషాదం

శాలిగౌరారం (తుంగతుర్తి) : తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురై కుమారుడు తనువుచాలించాడు.ఈ విషాదకర ఘటన మండలకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు. శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధి మార్కెట్‌కాలనీకి చెందిన రెబ్బ మల్లయ్య(80)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు రెబ్బ సోమనర్సయ్య(54),  రెండో కుమారుడు సత్యనారాయణ. వీరిలో సోమనర్సయ్య స్థానికంగా 30 సంవత్సరాలుగా ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. సత్యనారాయణ సూర్యాపేటలో ప్రైవేట్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా రెబ్బ మల్లయ్య కొంత అనారోగ్యానికి గురై ఈనెల 5న మృతిచెందాడు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అతని పెద్దకుమారుడు సోమనర్సయ్య తండ్రి మరణించినప్పటినుంచి బయటికి రాకుండా ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో అతని కుటింబికులు చుట్టుపక్కలవారి సహాయంతో 108లో నకిరేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయనను వైద్యులు పరీక్షించేలోపే మృతిచెందినట్లు కుటింబికులు తెలిపారు. విషాదకర విషయమేమిటంటే రెబ్బ మల్లయ్య కుటుంబంలో గడచిన ఐదేళ్లలో ఐదుగురు ఆకస్మికంగానే మృత్యువాతపడ్డారు. వారిలో మొదటగా సోమనర్సయ్య కుమారుడు, ఆతర్వాత రెండు నెలల వ్యవధిలోనే తల్లి, మూడు సంవత్సరాల క్రితం సోదరుడి కుమార్తె, ఇప్పుడు ఆరు రోజుల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబం రోదిస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సోమనర్సయ్యకు భార్య, వివాహితురాలైన కుమార్తె, అవివాహితుడైన కుమారుడు ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా