తల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పేశాడు!

17 May, 2022 10:12 IST|Sakshi
సురేష్‌ తన తల్లి మృతదేహాన్ని ఉంచిన డ్రమ్‌

సాక్షి, చెన్నై: తల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో ఓ కుమారుడు కప్పేశాడు. పైగా దాన్ని ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ కుమారుడి మానసిక స్థితి ఈ దుశ్చర్యకు కారణంగా విచారణలో తేలింది. చెన్నై నీలాంకరై సరస్వతి నగర్‌కు చెందిన గోపాల్, షెన్బగం దంపతులకు ప్రభు, మురుగన్, సురేష్‌ అనే కుమారులు ఉన్నారు. గోపాల్‌ గతంలోనే మరణించాడు. ప్రభు, మురుగన్‌ చెన్నైలో వేర్వేరు ప్రాంతాల్లో కుటుంబాలతో నివాసం ఉన్నారు.

ఇంట్లో చిన్న కుమారుడు సురేష్‌(50), తల్లి షెన్బగం (86) మాత్రమే ఉన్నారు. ఇక మానసిక చచలత్వంతో వ్యవహరిస్తుండడంతో నెల రోజుల క్రితం సురేష్‌ను వదిలి పెట్టి భార్య పిల్లలు వెళ్లిపోయారు. అప్పటి నుంచి తల్లితో పాటుగా సురేష్‌ ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం తల్లిని చూసేందుకు పెద్ద కుమారుడు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు.

ఇంట్లోకి వెళ్లనివ్వక పోవడంతో అనుమానం 
తల్లి ఇంట్లో లేదని చెప్పడమే కాకుండా,ఇంట్లోకి సురేష్‌ తనను అనుమతించక పోవడంతో ప్రభు నీలాంకరై పోలీసుల్ని ఆశ్రయించాడు. వారు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా, ఆ డ్రమ్‌లో తల్లి మృతదేహం ఉన్నట్టు సురేష్‌ చెప్పడంతో విస్మయానికి గురయ్యారు. ఆ డ్రమ్‌ను పగల కొట్టి చూడగా అందులో షెన్భగం మృతదేహం బయట పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి అనారోగ్యంతో మరణించి, అంత్యక్రియలు చేయలేని పరిస్థితుల్లో సురేష్‌ ఈ చర్యకు పాల్పడ్డాడా లేదా ప్రాణాలతోనే డ్రమ్‌లో కప్పేశాడా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.

చదవండి: స్టేట్‌ లెవెల్‌ బాక్సింగ్‌ ప్లేయర్‌, పోలీసు ఉద్యోగం.. కానీ ఏం జరిగిందో ఏమో.. 

మరిన్ని వార్తలు