రూ.3.05 కోట్లు ఆదాయ పన్ను శాఖకు అప్పగింత | Sakshi
Sakshi News home page

రూ.3.05 కోట్లు ఆదాయ పన్ను శాఖకు అప్పగింత

Published Sun, Apr 11 2021 3:40 AM

SP Fakkirappa said the cash was handed over to the Income Tax Department for investigation - Sakshi

కర్నూలు: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) తనిఖీల్లో పట్టుబడిన రూ.3,05,35,500 నగదును విచారణ నిమిత్తం ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణికుడు బీఏ చేతన్‌కుమార్‌ వద్ద రెండు ట్రాలీ బ్యాగుల్లో నగదు పట్టుబడిన విషయం విదితమే. డబ్బుతోపాటు చేతన్‌కుమార్‌ను ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట హాజరుపరిచారు. ఎస్పీ శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ గౌతమి సాలితో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు.

చేతన్‌కుమార్‌ స్వస్థలం బెంగళూరు. చెన్నైకి చెందిన అరుణ్‌ అనే వ్యక్తి దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తూ నమ్మకం పెంచుకున్నాడు. డబ్బు మార్పిడి కోసం ఈ ఏడాది మార్చి 28న విమానంలో బెంగళూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు చేతన్‌కుమార్‌ను అరుణ్‌ పంపించాడు. రాయగఢ్‌కు చేరుకుని త్రీస్టార్‌ హోటల్‌ శ్రేష్ఠలో పది రోజుల పాటు ఉన్నాడు. అక్కడ కొంతమంది అతన్ని కలిసి పెద్ద మొత్తంలో నగదు అప్పగించారు. దాన్ని తీసుకుని ఈ నెల 8న రాయగఢ్‌ నుంచి విలాస్‌పూర్‌కు వెళ్లాడు. నగదు మార్పిడి పని జరగకపోవడంతో తిరిగి రాయపూర్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వాహనంలో హైదరాబాద్‌కు వచ్చాడు. తర్వాత బెంగళూరుకు ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరాడు.

ఈ క్రమంలో కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుబడ్డాడు. చెన్నైలోని రామచంద్ర మెడికల్‌ కళాశాలకు చెందిన వారి డబ్బు అంటూ దర్యాప్తులో చేతన్‌కుమార్‌ తెలిపాడని, అయితే అందుకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో కర్నూలు అర్బన్‌ తాలూకా పోలీసు స్టేషన్‌లో సీఆర్‌పీసీ సెక్షన్‌ 102 కింద కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. గత మూడు నెలల కాలంలో ఇక్కడ రూ.8 కోట్ల నగదు, 25 కిలోల బంగారు, 12 కిలోల వెండి, 500 గ్రాముల వజ్రాలు సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తరువాతనే పట్టుపడిన నగదు, నగలు తిరిగి యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Advertisement
Advertisement