ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే

15 Aug, 2023 11:10 IST|Sakshi

సీతంపేట/బూర్జ(శ్రీకాకుళం): సీతంపేట ఏజెన్సీలోని గొయిది గ్రామ సమీపంలో సోమవారం ఓ బైక్‌, ఆటో ఢీనండంతో జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం గుత్తవల్లికి చెందిన పైడి వసంతకుమారి (17) మృతి చెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుత్తవల్లి పక్కగ్రామానికి చెందిన యువకుడు కూన వెంకటేష్‌, వసంతకుమారి బైక్‌పై సీతంపేట వచ్చారు.

తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో గాయాలపాలవగా యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇద్దరినీ 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడు వెంకటేష్‌ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, సత్యనారాయణ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.నీలకంఠరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు.

మరిన్ని వార్తలు