పేట్రేగిన ‘ఎర్ర’ దొంగలు | Sakshi
Sakshi News home page

పేట్రేగిన ‘ఎర్ర’ దొంగలు

Published Wed, Dec 22 2021 4:21 AM

Stone attack of Red sandalwood Smugglers On Forest Officers - Sakshi

భాకరాపేట: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల తమిళ దండు దందా పేట్రేగిపోతున్నది. భాకరాపేట ఫారెస్టు రేంజర్‌ పట్టాభి కథనం మేరకు.. మూడు రోజుల క్రితం పీలేరు రూరల్‌ సీఐ, ఎర్రావారిపాళెం పోలీసులు నిర్వహించిన దాడుల్లో 12 మంది ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు. పారిపోయిన మరికొంతమంది కోసం తలకోన అటవీ ప్రాంతాన్ని రెండు రోజులుగా జల్లెడ పడుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున తలకోన సెంట్రల్‌ బీట్‌ పరిధిలో గాలిస్తుండగా..దొర్రికనుమ ప్రాంతంలో దుంగలు తీసుకొస్తూ కొంతమంది తారసపడ్డారు. వీరిని చుట్టుముట్టే క్రమంలో.. ఆ ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వారిని ఎదురుగానే ఎదుర్కోవాల్సి వచ్చింది.

దొంగలు దుంగలు పడేసి రాళ్లు రువ్వుతూ పరుగులు దీశారు. వారిని వెంబడించగా కాటర్‌బాల్‌ సహాయంతో రాళ్లు రువ్వుతూ అటవీ ప్రాంతంలోకి జారుకున్నారు.1,103 కిలోల బరువు గల 36 దుంగలను స్వాధీనం చేసుకుని భాకరాపేట ఫారెస్టు కార్యాలయానికి తీసుకొచ్చినట్లు రేంజర్‌ తెలిపారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో ఎఫ్‌ఎస్‌వో రవిరావు, ఎఫ్‌బీవో వందనకుమార్, వినోద్‌కుమార్, శంకర్, బేస్‌క్యాంపు సిబ్బంది, తలకోన సీబీఈటీ సభ్యులు పాల్గొన్నారు.  

వాళ్లువీళ్లు ఒక్కటేనా?  
2 రోజుల క్రితం జరిపిన దాడుల్లో పట్టుబడ్డ తమిళ స్మగ్లర్లు, మంగళవారం తప్పించుకున్న స్మగ్లర్లు ఒక బృందంలోని వారేనా అనే కోణంలో అటవీ అధికారులు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళ స్మగ్లర్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement