Sakshi News home page

‘స్కిల్‌’ స్కామ్‌లో షెల్‌.. షా

Published Thu, Dec 16 2021 2:49 AM

TDP Govt Scame With Shirish Chandrakant Shah With bogus company - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల కుంభకోణం కేసులో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు గత సర్కారు పెద్దలు ఏకంగా దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ ఆర్థిక నేరస్తుడు శిరీష్‌ చంద్రకాంత్‌ షాను రంగంలోకి దించినట్లు తాజాగా వెల్లడైంది. ఏకంగా 212 షెల్‌ కంపెనీలను  సృష్టించి రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డ శిరీష్‌ను అరెస్టు చేసేందుకు 2017లో స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకుంది. ఘరానా మోసగాడిని భాగస్వామిగా చేసుకుని టీడీపీ పెద్దలు 2015లో ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులను కొల్లగొట్టారంటే ఎంత పక్కాగా పన్నాగం పన్నారో స్పష్టమవుతోంది.

24 వరకు రిమాండ్‌.. మచిలీపట్నం జైలుకు తరలింపు
ఈ కేసులో తాజాగా సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించారు. ఆర్థిక నేరగాడు శిరీష్‌చంద్ర షాను ముంబైలో అరెస్టు చేశారు. బుధవారం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచగా ఈనెల 24వరకు రిమాండ్‌ విధించడంతో మచిలీపట్నంలోని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. 

షెల్‌ కంపెనీల డాన్‌... శిరీష్‌ 
శిరీష్‌ చంద్రకాంత్‌ షా దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ ఆర్థిక నేరస్తుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 212 షెల్‌ కంపెనీలను సృష్టించి నల్లధనాన్ని దారి మళ్లించిన ఘనుడు. ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, సెబీ తదితర సంస్థలన్నీ శిరీష్‌ చంద్రకాంత్‌ షా కోసం రంగంలోకి దిగాయంటే ఎంత ఘరానా నేరస్తుడో అర్థమవుతోంది. షెల్‌ కంపెనీలతో దేశ ఆర్థిక వ్యవస్థకే సవాల్‌గా మారిన అతడి ఆట కట్టించేందుకు కేంద్ర ఆదాయపన్ను శాఖ ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సహకారాన్ని కోరాల్సి వచ్చింది. పీఎంవో ఆధ్వర్యంలోని స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ద్వారా అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. 

‘స్కిల్‌’ కుంభకోణంలో కింగ్‌పిన్‌..
టీడీపీ పెద్దలు గుట్టు చప్పుడు కాకుండా ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులను కొల్లగొట్టేందుకు శిరీష్‌ చంద్రకాంత్‌ షాను పావుగా వాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.371 కోట్లను డిజైన్‌టెక్‌ కంపెనీ ద్వారా స్కిల్లర్‌ అనే షెల్‌ కంపెనీకి చెల్లించారు. ఆ కాంట్రాక్టు కింద హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ సరఫరా చేసిందంటూ ఏసీఐ అనే మరో షెల్‌ కంపెనీని తెరపైకి తెచ్చారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి పొందిన రూ.371 కోట్లలో రూ.242 కోట్లను స్కిల్లర్‌ కంపెనీ ఏసీఐకి చెల్లించింది. ఏసీఐ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి కథ నడిపించింది. అనంతరం రూ.242 కోట్లను తిరిగి టీడీపీ పెద్దలకు చెందిన డిజైన్‌టెక్‌కు చెల్లించింది.

ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని దొడ్డిదారిలో టీడీపీ పెద్దలకు కట్టబెట్టేందుకు సాధనంగా ఉపయోగపడిన షెల్‌ కంపెనీ ఏసీఐని శిరీష్‌ చంద్రకాంతే సృష్టించాడు. అతడు సృష్టించిన 212 షెల్‌ కంపెనీల్లో ఏసీఐ కూడా ఉందని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తన నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. శిరీష్‌ చంద్రకాంత్‌ షా 212 షెల్‌ కంపెనీల ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల మేర నల్లధనాన్ని మళ్లించినట్లు ఆదాయపన్ను శాఖ 2017లోనే వెల్లడించింది.

అందులో 2015–16లో ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా టీడీపీ సర్కారు చెల్లించిన నిధులు కూడా ఉన్నట్లు తాజాగా సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. ఈ ఒక్క కుంభకోణంలోనే కాదు 2014–19 మధ్య రాష్ట్రంలో పలు కుంభకోణాలకు సంబంధించి నిధులు మళ్లించేందుకు శిరీష్‌ చంద్రకాంత్‌ షాను టీడీపీ పెద్దలు వాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరిపితే భారీ స్థాయిలో కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement