కుమార్తె డ్రైవర్‌తో వెళ్లిపోయిందని.. ఫ్యామిలీ మొత్తం..

5 Oct, 2022 09:04 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో కోలారు జిల్లా హండిగనాళ గ్రామంలో మంగళవారం జరిగింది. శ్రీరామప్ప (69) తన భార్య సరోజ (55), కుమారుడు మనోజ్‌ (25), కూతురు అర్చనతో హండిగనాళలో ఉంటున్నారు.

ఇదే గ్రామానికి చెందిన డ్రైవర్‌ నారాయణ స్వామిని ప్రేమించిన అర్చన సోమవారం ఇల్లు వదిలి అతనితో వెళ్లిపోయింది. అర్చన ఒక్కలిగ అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి కాగా, నారాయణస్వామి దళిత వ్యక్తి. కూతురు కనిపించడం లేదని అదే రోజు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో తమ పరువు పోయిందని, ఇక జీవించలేమని నిర్ణయించుకున్నారు.

తమ మరణానికి అర్చనే కారణమంటూ సూసైడ్‌నోట్‌ రాసి పురుగుల మందు తాగి శ్రీరామప్ప, భార్య, కుమారుడు ప్రాణాలు తీసు కున్నారు. అదనపు ఎస్పీ కుశాల్‌ చౌక్సే, పోలీసు లు సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి తిరిగి రావాలని, లేకపోతే అందరం చచ్చిపో తామని అక్కకు తమ్ముడు మనోజ్‌ పంపిన మెసేజ్‌లను ఫోన్‌లో పోలీసులు గుర్తించారు. 

చదవండి: (భార్యను పుట్టింటికి పంపించి.. అక్క కూతురితో పెళ్లికోసం.. బావపై..)

మరిన్ని వార్తలు