అయ్యో పాపం! ఇప్పుడే వస్తానంటూ.. ‘వెళ్లిపోయింది’

9 Jun, 2022 15:33 IST|Sakshi
భార్య కోసం వేచి చూస్తున్న సత్యనారాయణ.

పక్షవాతంతో మంచంపై లేవలేని స్థితిలో భర్త

కారుకింద పడి మహిళ దుర్మరణం

చిన్నప్పుడే ఇద్దరు పిల్లల మృతి

భార్య చనిపోవడంతో ఒంటరైన భర్త

జనగామ: పక్షవాతంతో మంచాన పడిన భర్త.. ఆయనకు సపర్యలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్య.. ఏదో పనుండి ఇంట్లో నుంచి బయటకెళ్లిన భార్య కాస్తా కారు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడే వస్తానన్న భార్య మాట కోసం రెండు గంటలపాటు ఎదురుచూసి ఇక ఎప్పటికీరాదన్న విషయాన్ని తెలుసుకుని తను ఒంటరైపోయానని తల్లడిల్లిపోతున్న వైనం స్థానికుల్ని కలచివేస్తోంది. కష్టాల కడలిలో సంసార నావను ఈదుతోన్న కుటుంబాన్ని కారు ప్రమాద రూపంలో నిలువునా ముంచేసిన వైనం బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

జిల్లాలోని లింగాల ఘనపురం మండలం వడిచెర్లకు చెందిన నంగునూరి సత్యనారాయణ, లక్ష్మి(65) దంపతులు జనగామలోని ఓల్డ్‌ లక్ష్మీకృష్ణ థియేటర్‌ ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివాస ముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే చిన్నతనం లోనే పిల్లలు చనిపోగా సత్యనారాయణ వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నాళ్ల క్రితం పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో సత్యనారాయణ మంచానికే పరిమితమైపోయాడు. అప్పట్నుంచి ఆయనకు లక్ష్మి సపర్యలు చేస్తూ వస్తోంది. కుటుంబ పోషణ కోసం శ్రీచెన్న కేశ్వరస్వామి ఆలయంతోపాటు ఓ ప్రభుత్వ కార్యాలయంలో లక్ష్మి పనికి కుదిరింది. వచ్చిన డబ్బులతో భర్తకు వైద్యం చేయిస్తూ బతుకు బండి లాగిస్తోంది. 

ఈ క్రమంలో ఏదో పనుండి లక్ష్మి బయటకు వెళ్లాల్సి రావడంతో.. భర్తకు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో పక్కనే ఉన్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జమున లింగయ్య ఇంటి నుంచి ఆమె కుమారుడి కారును డ్రైవర్‌ వెనక్కి తీసుకొస్తుండగా అదుపుతప్పి కారు లక్ష్మి మీదకు దూసుకొచ్చింది. అప్పటికే తనవైపుగా వస్తున్న కారును చూసి ‘‘బాబూ.. మెల్లగా రా బాబూ’’..అంటూ లక్ష్మి ఎంత అరిచినా డ్రైవర్‌ వినిపించుకోకుండా కారును ఆమె పైనుంచి పోనివ్వడంతో లక్ష్మి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: ఇళ్లంతా సందడి.. కానీ చూస్తుండగానే..!)

మరిన్ని వార్తలు