ధర్మవరంలో విషాదం: మరణంలోనూ వీడని స్నేహం

9 Aug, 2021 07:54 IST|Sakshi
ప్రమాదంలో మృతిచెందిన అంకే ధనుశ్‌, భీమనపల్లి అనిల్‌కుమార్‌

ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో స్నేహితుల మృత్యువాత

చేతికొచ్చిన కుమారుల మృతితో విషాదంలో కుటుంబాలు

ధర్మవరం రూరల్‌: ఆ యువకులు ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు.. చదువుకున్నారు. ఇప్పుడు ఒకే రకమైన వ్యాపారం చేసుకుంటూ వారి కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. అవివాహితులైన వీరిద్దరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన అంకే ధనుశ్‌ (25), రాంనగర్‌కు చెందిన భీమనపల్లి అనిల్‌కుమార్‌ (27) మిత్రులు. వీరిద్దరూ మగ్గం నేస్తూ పట్టు చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు.

మగ్గం సామగ్రి కోసం ఆదివారం గోరంట్లకు వెళ్లారు. పని ముగించుకుని అక్కడి నుంచి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా ధర్మవరం మండలం మోటుమర్ల గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రగాయాలవడంతో ధనుశ్‌, అనిల్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. రూరల్‌ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్‌ ఆదోని, సీటీఎం గోపాల్‌రెడ్డి, ధర్మవరం, పుట్టపర్తి డిపో మేనేజర్లు మల్లికార్జున, ఇనయతుల్లా, ఈయూ నాయకులు నాగార్జునరెడ్డి, సుమో శీనా తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై స్థానికులను ఆరా తీశారు. స్నేహితులిద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు