ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

23 Dec, 2020 07:46 IST|Sakshi

సాక్షి, కోస్గి (మహబూబ్‌నగర్‌): యువకుడి అనుమానాస్పద మృతి కేసు, హత్య అని నారాయణపేట డీఎస్పీ మధుసూదన్‌ రావు నిర్ధారించారు. మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్యకు సంబందించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈనెల 18న పట్టణ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని చెప్పారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మృతుని భార్య, ఆమె ప్రియుడు పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు రెండు రోజుల వ్యవధిలోనే ఆధారాలు సేకరించామని తెలిపారు. ఆ వివరాలు..  వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం పర్సాపూర్‌ గ్రామానికి చెందిన ఆంజనేయులు(35)కు కోస్గి మండలంలోని కడంపల్లికి చెందిన లక్ష్మితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. లాక్‌డౌన్‌ సమయంలో వీరు జీవనోపాధి కోసం తాండూర్‌లో కూలీ పనులు చేస్తుండేవారు.

అదే కాలనీలో నివాసం ఉండే ‌ బాలుడితో లక్ష్మికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. దీంతో భార్య లక్ష్మి తన పిల్లలతో పుట్టింటికి వచ్చింది. అక్కడే ఉంటూ ప్రియుడితో సంబంధం కొనసాగిస్తోంది. ఎలాగైన భర్తను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు. ఈనెల 17న బంధువుల ఇంట్లో విందుకు భార్య లక్ష్మి పిలవడంతో వచ్చిన ఆంజనేయులును ప్రియుడు రాజు కలిసి ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఉదయం నుంచి రాత్రివరకు మద్యం తాగించి పట్టణ శివారులోని బస్‌డిపో ప్రాంతంలో ఆంజనేయులు కాళ్లు, చేతులు కట్టివేసి బ్లెడ్‌తో చేతి మణికట్టు లోతుగా కోసి పరారయ్యాడు. మద్యం మత్తులో లేవలేని స్థితిలో ఉన్న ఆంజనేయులు తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు.


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మధుసూదన్‌ రావు  

భార్యపైనే అనుమానమంటూ ఫిర్యాదు.. 
మృతుని తల్లి రాములమ్మ తన కొడుకును అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులే హత్య చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమదైన శైలిలో భార్యను విచారించారు. హత్య చేసేందుకు మైనర్‌ బాలుడు భయపడినప్పటికీ మళ్లీ మళ్లీ ఫోన్‌చేసి అతన్ని ఒప్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో ప్రేమలో విఫలమైన బాలుడు బ్లేడ్‌తో చేయి కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి బతికిపోయినట్లు తెలుసుకున్న లక్ష్మీ, తన భర్తను సైతం మద్యం తాగించి చేయికోసి చంపాలని సూచించడంతో అదే రీతిలో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనలో ఏ–1గా మైనర్‌ బాలుడు, ఏ–2గా లక్ష్మీలను చేర్చి హత్యకేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాలుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తామన్నారు. 

>
మరిన్ని వార్తలు