‘నా పరిస్థితి ఎవరికీ రావొద్దు’.. యువతి సెల్ఫీ వీడియో కలకలం

28 Sep, 2022 08:24 IST|Sakshi

గీసుకొండ(వరంగల్‌ జిల్లా): ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతోపాటు అతడి బంధువుల వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటగండి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం.. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం, నసీమా దంపతుల కూతురు నూర్జహాన్‌ అదే గ్రామానికి చెందిన రవి, అరుణ దంపతుల కుమారుడు శరత్‌ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్నారు.
చదవండి: డీజే ప్రవీణ్‌తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య

ఆ తర్వాత కొన్ని రోజులకు   భర్త శరత్‌తోపాటు అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త నూర్జహాన్‌ను కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై పలుమార్లు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా.. వారి తీరు మారలేదు. వారి వేధింపులు భరించలేక నూర్జహాన్‌ మంగళవారం సాయంత్రం గీసుకొండ మండలం కోటగండి వద్దకు వచ్చి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. క్రిమిసంహారక మందు తాగే ముందు నూర్జహాన్‌ సెల్‌ఫోన్‌లో తన బాధను వీడియో తీసి తెలిసిన వారికి వాట్సాప్‌లో పెట్టింది.

ఎక్కడికెళ్లినా న్యాయం జరగలేదు.. 
‘నా చావుకు కారణం మాత్రం నా హజ్బెండ్, మా ఆడబిడ్డ, మా బావ, మా అత్తమామలు.. నేను లవ్‌ మ్యరేజ్‌ చేసుకున్నా.. క్యాస్టు తక్కువని, కట్నం కోసం కొట్టడంతోపాటు చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు. చాలా పీఎస్‌లకు తిరిగాను. నాకు ఎక్కడా న్యాయం లేదు. ఉమెన్‌ పీఎస్‌కు వెళ్లినా అక్కడ సీఐ సారు వాళ్లవద్ద మనీ తీసుకుని నాకు న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదు. అందుకే చనిపోతున్నా.. నాలాంటి సిచ్యువేషన్‌ ఇంకో అమ్మాయికి రాకుండా చూడండి.. ప్లీజ్‌..’ అని ఒక వీడియోలో .. మరో వీడియోలో ‘అన్నా వినయ్‌రెడ్డి అన్నా థాంక్యూ వెరీమచ్‌ అన్నా. ఒక చెల్లిగా నాకు సహాయం చేసినందుకు థాంక్యూ అన్నా’ అంటూ మరో వీడియోను నూర్జహాన్‌ పోస్టు చేసింది.

మరిన్ని వార్తలు