నేను ప్రేమిస్తున్నా.. నువ్వు ప్రేమించాల్సిందే..!

4 Oct, 2020 06:45 IST|Sakshi
జీవానందం 

మిత్రుడే కదాని నాలుగురోజులు ఇంట్లో ఉండేందుకు అనుమతిస్తే, చివరకు యువతితో పాటు ఆమె కుటుంబాన్ని సజీవదహనం చేయడానికి యత్నించాడో ప్రేమోన్మాది. వన్‌ సైడ్‌ లవ్‌ ఉన్మాదంతో చివరకు ఆ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

సాక్షి, చెన్నై: చెన్నై వలసరవాక్కం అన్బునగర్‌కు చెందిన ఓ యువతి, అరియలూరుకు చెందిన జీవానందం(22) కళాశాల మిత్రులు. వీరిద్దరు బీఎస్సీ పట్టభద్రులు. చదువుకునే సమయంలో ఉన్న చనువుతో తన ఇంటి చిరునామాను జీవానందంకు ఆ యువతి ఇచ్చింది. అయితే, అతడిలో వన్‌ సైడ్‌ లవ్‌ ప్రేమోన్మాది ఉన్నాడన్న విషయాన్ని ఆ యువతి పసిగట్ట లేకపోయింది.

గత నెల 29వ తేదీ రాత్రి సమయంలో చెన్నైకు వచ్చిన జీవానందం, తన వద్ద ఉన్న చిరునామా మేరకు అన్భునగర్‌కు వెళ్లాడు. పని నిమిత్తం మిత్రుడు దూరం నుంచి వచ్చేశాడుగా అనుకున్న ఆ యువతి తల్లిదండ్రుల అనుమతితో ఆ రాత్రి ఇంట్లో ఆశ్రయం కల్పించింది. ఒక రోజు అన్నది నాలుగు రోజులకు చేరింది. శుక్రవారం రాత్రి తమ కుమార్తెను తల్లిదండ్రులు మందలించారు. ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో అని ఆందోళన వ్యక్తం చేశారు.  ఆ మిత్రుడ్ని పంపించేయాలని హెచ్చరించారు.  

ఉన్మాదిగా.. 
ఈ మాటల్ని చాటుగా విన్న జీవానందం అర్ధరాత్రి వేళ ఉన్మాది అయ్యాడు. ఇంట్లో ఉన్న స్నేహితురాలి తల్లిదండ్రులు నిద్ర లేపి మరీ తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అదే సమయంలో తన గది నుంచి బయటకు వచ్చిన స్నేహితురాల్ని చూసి, ‘తాను ప్రేమిస్తున్నానని, పెళ్లంటూ చేసుకుంటే నిన్ను తప్ప మరొకర్ని చేసుకోనని, నువ్వు కూడా నన్ను ప్రేమించాల్సిందేనని’ ఒత్తిడి తెచ్చాడు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న ఆ యువతి జీవానందంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కలిసి చదువుకున్న మిత్రుడి కదా అని ఆశ్రయం ఇస్తే, తన తల్లిదండ్రుల ముందు పరువు తీశావంటూ తీవ్రంగా మండిపడింది. (ప్రేమించి పెద్దల్ని ఎదిరించి.. అంతలోనే..)

దీంతో జీవానందంలోని ఉన్మాది రెచ్చిపోయాడు. ఆ యువతిని, ఆమె తల్లిదండ్రుల్ని ఓ గదిలోకి నెట్టి వంట గదిలో ఉన్న గ్యాస్‌ తెరిచేశాడు. అందర్నీ తగల బెట్టేస్తానంటూ హెచ్చరించడం మొదలెట్టాడు. అదే సమయంలో పక్కింటో ఉన్న వాళ్లు గ్యాస్‌ లీక్‌ వాసనను పసిగట్టారు. ఆ యువతి ఇంట్లో నుంచి వాసన వస్తున్నట్టుగా గుర్తించి తలుపు తట్టడం జీవానందం ఆందోళనలో పడ్డాడు. భయంతో తలుపు తీసి బయటకు పరుగు తీయబోతుండగా, ఇరుగుపొరుగు వారు పట్టుకున్నారు.

గదిలో ఉన్న ఆ యువతి, ఆమె తల్లిదండ్రుల్ని రక్షించాడు. ఇక, తనను కొట్టి చంపేస్తారేమో అన్న భయంతో కిటికి అద్దాలను పగులగొట్టి, గొంతు కోసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడ్ని కీల్పాకం ఆస్పత్రికి తరలించగా, మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఒన్‌ సైడ్‌ ప్రేమ కారణంగా జీవానందం బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.  

మరిన్ని వార్తలు