‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’ | Sakshi
Sakshi News home page

‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’

Published Wed, May 18 2022 6:22 AM

Youth Suicide Over Divorced Parents Issue Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై : ‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’ అని  వేర్వేరుగా జీవిస్తున్న తల్లిదండ్రులకు ఓ కుమారుడు లేఖ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నామక్కల్‌లో ఈ ఘటన విషాదాన్ని నింపింది. నామక్కల్‌ జిల్లా కొళ్లకురిచ్చి గ్రామం పరిధిలోని సింగలాపురానికి చెందిన రవి, మేఘల దంపతులకు తరుణ్‌(17)తో పాటుగా ఓ కుమార్తె(20) ఉన్నారు. ఈ దంపతులు అభిప్రాయ భేదాలతో ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తున్నారు.

రవి వద్ద తరుణ్, మేఘల వద్ద కుమార్తె ఉన్నారు.  తల్లిదండ్రులు ఇద్దరు వేర్వేరుగా జీవిస్తుండడం తరుణ్‌తో పాటుగా అతడి సోదరిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. తల్లిదండ్రుల్ని కలిపేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. ముఖ్యంగా తండ్రి ఓ చోట, తల్లి మరో చోట ఉండటాన్ని తరుణ్‌ జీర్ణించుకోలేక పోయాడు.  

చావుతో అయినా.. 
ప్రస్తుతం ప్లస్‌టూ పరీక్షల్ని తరుణ్‌ రాస్తున్నాడు. తల్లిదండ్రులు వేర్వేరుగా జీవిస్తుండడంతో పరీక్షలపై దృష్టి పెట్టలేక సతమతం అవుతూ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఉదయం తన గది నుంచి తరుణ్‌ బయటకు రాకపోవడంతో తలుపుల్ని తండ్రి రవి బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతదేహంగా వేలాడుతూ కనిపించాడు. తన పుస్తకాల్లో తరుణ్‌ రాసి పెట్టిన లేఖను గుర్తించారు. ఇందులో తల్లిదండ్రులు వేర్వేరుగా జీవిస్తుండడంతో తీవ్ర వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు వివరించాడు. వారిద్దురు కలిసి జీవించాలన్నదే తనతో పాటుగా తన సోదరి ఆకాంక్ష అని వివరించాడు.

Advertisement
Advertisement