ఉత్తమ నాటిక ‘అంధస్వరం’ | Sakshi
Sakshi News home page

ఉత్తమ నాటిక ‘అంధస్వరం’

Published Sun, Mar 26 2023 2:34 AM

- - Sakshi

ముగిసిన సీఆర్‌సీ జాతీయ తెలుగు నాటిక పోటీలు

విజేతలకు బహుమతులు

రావులపాలెం: ఉగాది పర్వదినం సందర్భంగా రావులపాలెం కాస్మోపాలిటన్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ (సీఆర్‌సీ) ఆధ్వర్యాన కాటన్‌ కళావేదికపై ఈ నెల 22న ప్రారంభమైన జాతీయ తెలుగు నాటికల పోటీలు శుక్రవారం అర్ధరాత్రి ముగిశాయి. ప్రదర్శనల అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, సినీ నటులు తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, కృష్ణభగవాన్‌, కోట శంకరరావు, గౌతంరాజు, నైనా, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, సీఆర్‌సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్‌రెడ్డి, నాటక కళాపరిషత్‌ డైరెక్టర్‌ కె.సూర్య, పరిషత్‌ పర్యవేక్షణ డైరెక్టర్‌ వెలగల సతీష్‌రెడ్డి, డైరెక్టర్లు సీహెచ్‌ గోపాలకష్ణ, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, పడాల సత్యనారాయణరెడ్డి, మల్లిడి ఆంజనేయరెడ్డి, చిర్ల కనికిరెడ్డి, నల్లమిల్లి వీరరాఘవరెడ్డి తదితరులు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి, జగ్గిరెడ్డి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరానికి అందిచాలనే సంకల్పంతో నాటక రంగానికి సీఆర్‌సీ అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేదని కొనియాడారు.

ఉత్తమ ప్రథమ ప్రదర్శనగా కళలు కాణాచి (తెనాలి) వారి ‘అంధస్వరం’ నిలిచింది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా తెలుగు కళా సమితి (విశాఖపట్నం) వారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత?’, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా కళాంజలి (హైదరాబాద్‌) వారి ‘రైతే రాజు’ నాటికలు నిలిచాయి. ఉత్తమ ప్రథమ ప్రదర్శనకు రూ.3 లక్షలు, ద్వితీయ ప్రదర్శనకు రూ.2 లక్షలు, తృతీయ ప్రదర్శనకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతులు, షీల్డులు అందజేశారు. ఉత్తమ నటనకు సంబంధించి మొదటి ఐదు స్థానాల్లో జి.నాగదుర్గ కుసుమసాయి (కాపలా నాటిక), వనార సహారిక కార్తిక్‌ (ఫ్రీడమ్‌ ఫైటర్‌), బి.రాధాకృష్ణ (ఎడారిలో వాన చినుకు), ఆర్‌.వాసుదేవరావు, కె.జాహ్నవి (అతడు అడవి జయించాడు నాటిక) అవార్డులు దక్కించుకున్నారు. యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ ‘అతడు అడవిని జయించాడు’ నాటికకు ఎన్‌.పవన్‌ కళ్యాణ్‌ (ఉత్తమ రంగాలంకరణ), యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ ‘అతడు అడవిని జయించాడు’ నాటికకు లీలామోహన్‌, ప్రశాంత్‌, విద్యాసాగర్‌ (ఉత్తమ సంగీతం), వరంగల్‌ శారదా నాట్య మండలి ‘ఫ్రీడమ్‌ ఫైటర్‌’ నాటికకు శ్రీధర్‌ పైడి (ఉత్తమ ఆహార్యం) అవార్డులు దక్కాయి.

Advertisement
Advertisement