వ్యాపారం చిన్న.. సాయం మిన్న | Sakshi
Sakshi News home page

వ్యాపారం చిన్న.. సాయం మిన్న

Published Tue, Mar 28 2023 2:32 AM

కొబ్బరి తాడు తయారు చేస్తున్న మహిళలు  - Sakshi

ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం

జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమైతే ప్రభుత్వ పరంగా అందించడంతో పాటు రాయితీలు ఇచ్చి, ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. ప్రమోషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వుమెన్‌ ఎంటర్‌పెన్యూర్స్‌లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో విడతగా జిల్లాలోని 34 యూనిట్లకు సోమవారం కలెక్టరేట్‌లో ఆయన రుణాలందించారు. మహిళలు విలువ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి, కొబ్బరి ఉత్పత్తులు తయారు చేస్తే, అవసరమైన మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన స్వయం సహాయక సంఘాల మహిళలతో కలెక్టర్‌ మాట్లాడుతూ, యూనిట్ల స్థాపనకు సంబంధించిన విధి విధానాలు, మూలధనం, పెట్టుబడి వ్యయం, ముడి సరకు లభ్యత, విలువ ఆధారిత వస్తువుల ప్యాకింగ్‌, మార్కెటింగ్‌, ఆదాయ వనరుల లభ్యత తదితర అంశాలపై ఆరా తీశారు.

మహిళలు, రైతులకు

మేలు చేసేందుకు రుణాలు

సిడ్బీ, ఎంఈపీపీల ఆధ్వర్యాన

చిన్న పరిశ్రమలకు చేయూత

భారీగా రాయితీ ఇస్తున్న ప్రభుత్వం

సాక్షి, అమలాపురం: మహిళల ఆర్థికాభివృద్ధి ఒకవైపు.. వ్యవసాయ, ఉద్యాన పంటల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మరోవైపు.. ఈ రెండు లక్ష్యాలూ సాధించేందుకు రాయితీలతో కూడిన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఇటు మహిళలతో పాటు అటు రైతులకు కూడా నేరుగా లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే వందలాది మంది కార్మికులకు ఉపాధి కూడా దక్కనుంది. ఇన్ని ఫలితాలు ఉన్నందునే ప్రభుత్వం ప్రమోషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వుమెన్‌ ఎంటర్‌పెన్యూర్స్‌లో భాగంగా స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిడ్బీ), మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోషనల్‌ ప్రోగ్రామ్‌ (ఎంఈపీపీ) ఆధ్వర్యాన చిన్నతరహా పరిశ్రమలకు చేయూతనందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో 103 యూనిట్లకు రూ.1.93 కోట్ల మేర రుణాలు అందజేశారు. ఇందులో రూ.67.55 లక్షల మేర ప్రభుత్వం సబ్సిడీ అందించడం విశేషం.

ఉత్పత్తి దిశగా..

జిల్లావ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత లబ్ధిదార్లలో రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకూ రుణం పొందినవారున్నారు. మండపేట మండలం ద్వారపూడిలో గిఫ్ట్‌ ఆర్టికల్స్‌ తయారీ పరిశ్రమకు రూ.25 లక్షల రుణం అందించారు. అలాగే కంప్యూటరైజ్డ్‌ ఎంబ్రాయిడరీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఆత్రేయపురం మండలం రాజవరం, పులిదిండి గ్రామాల్లో ఫర్నిచర్‌ పరిశ్రమలు పెట్టగా, ఆలమూరులో రూ.50 లక్షలతో పీవీసీ బ్యాగ్‌లు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఇది ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది.

35 శాతం సబ్సిడీతో..

రెండో విడతగా జిల్లాలో 34 యూనిట్ల స్థాపనకు లబ్ధిదారులైన మహిళలకు రూ.61 లక్షల మేర రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో లబ్ధిదారుల వాటా కేవలం (5 శాతం) కాగా, బ్యాంకు రుణంగా రూ.58 లక్షలు (60 శాతం) ఇస్తారు. ఇందులో ప్రభుత్వం రూ.21.35 లక్షల (35 శాతం) మేర సబ్సిడీ ఇవ్వనుంది. మహిళా స్వయంశక్తి సంఘాల్లో ఔత్సాహికులను గుర్తించి, వారి ద్వారా క్వాయర్‌, హస్తకళా పరిశ్రమలతో పాటు జిరాక్స్‌ సెంటర్ల వంటివి ఏర్పాటు చేయించారు. అయితే 80 శాతం క్వాయర్‌, హస్తకళా పరిశ్రమలే కావడం విశేషం. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ రుణాలు ఇప్పించారు. ప్రభుత్వం ఏకంగా 35 శాతం సబ్సిడీ ఇస్తూండటంతో ఎక్కువ మంది లబ్ధిదారులు వ్యాపారాలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. తద్వారా తమ కాళ్లపై తాము నిలదొక్కుకునేందుకు వారికి మార్గం సుగమమవుతోంది.

2022–23 ఆర్థిక సంవత్సరంలో సాయం అందించారిలా..

విడత యూనిట్లు రుణాలు రాయితీ

(రూ.లలో) (రూ.లలో)

మొదటి 69 1,32,00,000 46,20,000

రెండు 34 61,00,000 21,35,000

మొత్తం 103 1,93,00,000 67,55,000

కొబ్బరి పీచుతో..

కొబ్బరి పీచుతో అలంకరణ వస్తువులు, డోర్‌ మ్యాట్లు తయారు చేస్తున్నాను. నాకు కొబ్బరి తాళ్లు తయారు చేసే యంత్రం ఉంది. రూ.లక్ష రుణం ఇచ్చారు. నేను రూ.5 వేలు చెల్లించగా, బ్యాంకు నుంచి రూ.95 వేలు వచ్చింది. ఇందులో రూ.35 వేల రాయితీ వస్తుందని అధికారులు చెప్పారు. దీనివలన నేను చేసే వ్యాపారం, లాభం మరింత పెరగనున్నాయి.

– కుంపట్ల విజయదుర్గ, అప్పనపల్లి, మామిడికుదురు మండలం

మరో యంత్రం కొనుగోలుకు..

ప్రస్తుతం ఒక మెషీన్‌ ద్వారా కొబ్బరి తాళ్లు తయారు చేస్తున్నాను. ఇప్పుడు రూ.2 లక్షల రుణం మంజూరు చేశారు. ఇందులో నా వాటా రూ.10 వేలు కాగా, బ్యాంకు నుంచి రూ.1.90 లక్షల రుణం వచ్చింది. ఇందులో రాయితీగా రూ.75 వేలు వస్తుందని తెలిపారు. ఈ రుణంతో కొత్తగా మరో మెషీన్‌ కొనుగోలు చేస్తాను. దీనివలన కొబ్బరి తాడు తయారీ మరింత పెంచే వెసులుబాటు కలుగుతుంది.

– ముత్తాబత్తుల అంజనీ కుమారి, పేరూరు, అమలాపురం మండలం

స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల చెక్‌ అందిస్తున్న కలెక్టర్‌ శుక్లా
1/3

స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల చెక్‌ అందిస్తున్న కలెక్టర్‌ శుక్లా

2/3

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement