పోస్టల్‌ నిధుల గోల్‌మాల్‌పై సీబీఐ విచారణ | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ నిధుల గోల్‌మాల్‌పై సీబీఐ విచారణ

Published Tue, Mar 28 2023 11:44 PM

-

అమలాపురం టౌన్‌: అయినవిల్లి మండలం విలస సబ్‌ పోస్టాఫీస్‌ ద్వారా ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌(ఐపీపీబీ)లో జరిగిన రూ.1.18 కోట్ల గోల్‌మాల్‌పై సీబీఐ అధికారులు మంగళవారం విచారణ నిర్వహించారు. విశాఖపట్నం సీబీఐ కార్యాయం నుంచి ఇద్దరు అధికారులు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ ఈ విచారణ సాగించారు. తొలుత వారు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.శ్రీధర్‌తో భేటీ అయ్యారు. నిధుల దుర్వినియోగంపై నమోదైన కేసులోని నిందితుల సమగ్ర సమాచారం సేకరించారు. గత ఏడాది మే నెల మొదటి వారంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై శాఖాపరంగా జరిగిన ప్రాథమిక విచారణలో పర్యవేక్షణ లోపానికి బాధ్యులుగా గుర్తించి పోస్టల్‌ అసిస్టెంట్లు మంగతాయారు, మహాలక్ష్మిలను సస్పెండ్‌ చేశారు. ఎనిమిది మంది ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ నిధుల గోల్‌మాల్‌కు సూత్రధారిగా అమలాపురం హెడ్‌ పోస్టాఫీసులో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేసిన సతీష్‌ను గుర్తించారు. అయితే నిధుల దుర్వినియోగం వెలుగు చూడగానే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విచారణకు వచ్చిన సీబీఐ అధికారులు సస్పెండైన మంగతాయారు, మహాలక్ష్మిలను ఉదయం నుంచి రాత్రి వరకూ విచారించారు. ఈ కేసుకు సంబంధించిన ఐపీపీబీ రికార్డులను పరిశీలించారు. సమగ్ర సమాచారం సేకరించారు. సీబీఐ అధికారుల విచారణ బుధ, గురువారాల్లో కూడా కొనసాగుతుందని తెలిసింది. నిధుల దుర్వినియోగంలో షోకాజ్‌ నోటీసులు అందుకున్న ఎనిమిది మంది పోస్టల్‌ ఉద్యోగులను బుధవారం విచారించనున్నారని సమాచారం.

సూత్రధారిపై ఆరా

ఈ నిధుల దుర్వినియోగానికి సూత్రధారి అయిన సతీష్‌ పాత్రపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిధుల గోల్‌మాల్‌ బాగోతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ అజ్ఞాతంలో ఉన్న సతీష్‌ కదలికలపై వారు ఆరా తీస్తున్నారు. రెండు నెలల కిందట హెడ్‌ పోస్టాఫీసులో జరిగిన శాఖా పరమైన విచారణకు సతీష్‌ తన తండ్రితో హాజరయ్యాడు. అప్పట్లో సస్పెండైన, షోకాజ్‌ నోటీసులు అందుకున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కార్యాలయానికి వచ్చి సతీష్‌ను నిలదీశారు. ఈ నేపథ్యంలో అతడు కార్యాలయం పై అంతస్తు ఎక్కి ఆత్మహత్యకు ఆడిన నాటకీయ పరిణామాలు, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలు తెలిసిందే. నేటికీ అజ్ఞాతంలో ఉన్న సతీష్‌ను కూడా సీబీఐ అధికారులు ఏదో ఒకలా రప్పించి బుధ, గురువారాల్లో విచారించే అవకాశాలున్నాయని పోస్టల్‌ సిబ్బంది చెబుతున్నారు.

సస్పెండైన ఇద్దరు ఉద్యోగులను

ప్రశ్నించిన అధికారులు

రూ.1.18 కోట్ల ఐపీపీబీ నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు ముమ్మరం

అజ్ఞాతంలో ఉన్న సూత్రధారి కదలికలపై ఆరా

Advertisement
Advertisement