బంద్‌... అట్టర్‌ ఫ్లాప్‌ | Sakshi
Sakshi News home page

బంద్‌... అట్టర్‌ ఫ్లాప్‌

Published Tue, Sep 12 2023 2:26 AM

మండపేట కేపీ రోడ్డులో తెరుచుకున్న దుకాణాలు  - Sakshi

కోనసీమలో కానరాని టీడీపీ బంద్‌

పట్టించుకోని జనం.. పార్టీ క్యాడర్‌ దూరం

యథావిధిగా తిరిగిన ఆర్టీసీ బస్సులు

తెరుచుకున్న దుకాణాలు, హోటళ్లు

సాక్షి, అమలాపురం: టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ జిల్లాలో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఈ బంద్‌ పిలుపును సామాన్యులే కాదు.. ఆ పార్టీ క్యాడర్‌ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీనికి జనసేన బహిరంగంగా మద్దతు ఇచ్చినా ఫలితం లేదు. జిల్లా కేంద్రం అమలాపురంతో సహా మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ఏమాత్రం ప్రభావం కనిపించలేదు.

జిల్లాలో టీడీపీ బంద్‌ విఫలమైంది. జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగింది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం, రాజోలు బస్‌ డిపోల నుంచి పల్లె వెలుగు, దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్‌, ఇతర సర్వీసులు యథావిధిగా ముందుకు సాగాయి. అమలాపురం బస్టాండ్‌ వద్ద టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు వచ్చి హడావుడి చేయగా పోలీసులు అక్కడి నుంచి వారిని తరలించారు. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేశాయి. ప్రైవేట్‌ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో కొన్నింటి వద్ద విద్యార్థులను బలవంతంగా పంపించారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఇతర పార్టీ నాయకులు మధ్యాహ్న సమయంలో అమలాపురం మెయిన్‌రోడ్డులో కొంత హడావుడి చేశారు. ఆ సమయంలో మినహా ఉదయం నుంచి రాత్రి వరకూ దుకాణాలు తెరుచుకునే ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌కు, ఇతర ప్రాంతాలకు ముందుగా పార్టీ ద్వితీయశ్రేణి నాయకులను పంపి వారు మాత్రం దూరంగా ఉన్నారు. టీడీపీ నాయకుల కన్నా ఇక్కడ జనసేన నాయకులే కొంత చురుగ్గా వ్యవహరించారు.

మండపేట పట్టణంలో బంద్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదు. టీడీపీ, జనసేన నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. రామచంద్రపురంలో అసలు బంద్‌ జరగలేదు. పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో కొంతసేపు నాయకులు దుకాణాలు మూయించివేశారు. ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. బంద్‌ ప్రభావం లేకున్నా కోనసీమలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భారీ వర్షం కురవడంతో కొంత వరకూ రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.

పిలుపునకు ప్రజలు దూరం

టీడీపీ బంద్‌కు సామాన్యులు, వ్యాపారులు దూరంగా ఉన్నారు. సాధారణంగా పార్టీలు బంద్‌కు పిలుపునిస్తే అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు తప్ప సాధారణ ప్రజలు తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. బస్సులను తిరగనివ్వరని, దారిలో అడ్డుకుంటారనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ వాహనాల ద్వారా ప్రయాణాలు చేస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రయాణాలు పెట్టుకుంటారు. కానీ ఈ సారి జిల్లాలో అమలాపురం, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాజోలు, మండపేట వంటి పెద్ద బస్టాండ్‌లలో ప్రయాణికులు ఉదయం పెద్ద సంఖ్యలో కనిపించడం విశేషం. హోటళ్లు యథావిధిగా తెరుచుకున్నాయి. బంద్‌ వల్ల ఉదయం హోటల్స్‌ తెరిచే అవకాశం ఉండదని చెప్పి వారు రోజంతా మూసివేస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి లేదు. బడ్డీల నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకూ అన్నింటినీ తెరిచారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వంటి వారు కూడా బంద్‌కు సహకరించలేదు.

క్యాడర్‌లోనే నిస్తేజం

బంద్‌ను విజయవంతం చేయడంలో టీడీపీ క్యాడర్‌ ఉదాహీనంగా వ్యవహరించింది. సాధారణంగా తెల్లవారు జామునే పార్టీ నాయకులు తొలుత బస్టాండ్‌ వద్ద బైఠాయిస్తారు. జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి లేదు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంత హడావుడి చేశారు. పోలీసులు గృహ నిర్బంధం చేస్తారనే వంకతో బంద్‌కు సీనియర్‌ నేతలు దూరంగా ఉండడం విశేషం. మధ్యాహ్న సమయంలో పార్టీ పెద్దలు నుంచి ఒత్తిడి రావడంతో టీడీపీ నాయకులు రోడ్డెక్కి కాస్త హడావుడి చేశారు.

బంద్‌ లేదు.. స్వీట్‌ తినండి

అమలాపురం పట్టణం: స్థానిక మెయిన్‌ రోడ్డులో పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు నల్లా మల్లిబాబుకు చెందిన గణపతి స్వీట్‌ షాపు ఉంది. టీడీపీ బంద్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ షాపు తెరిచి ఉండటం గమనార్హం. దీనిపై ‘టీడీపీ నాయకుడికి చెందిన దుకాణమే మూయలేదు.. ఇంకెక్కడ బంద్‌’ అని ప్రజలు చర్చించుకున్నారు. బంద్‌ పిలుపుతో ఆ పార్టీ నాయకులు పలు దుకాణాలను మూసి వేయించినా ఈ దుకాణం జోలికి వెళ్లకపోవడం విమర్శలకు దారి తీసింది.

అల్లవరంలో ఎంపీపీ పాఠశాలలకు 
తాళాలు వేస్తున్న టీడీపీ కార్యకర్తలు
1/3

అల్లవరంలో ఎంపీపీ పాఠశాలలకు తాళాలు వేస్తున్న టీడీపీ కార్యకర్తలు

ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి ప్రధాన 
సెంటర్లో యథావిధిగా వ్యాపారాలు
2/3

ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి ప్రధాన సెంటర్లో యథావిధిగా వ్యాపారాలు

అమలాపురంలో బంద్‌ను పట్టించుకోకుండా తెరిచి ఉంచిన టీడీపీ నాయకుడి స్వీట్‌ షాపు
3/3

అమలాపురంలో బంద్‌ను పట్టించుకోకుండా తెరిచి ఉంచిన టీడీపీ నాయకుడి స్వీట్‌ షాపు

Advertisement
Advertisement