సత్యదీక్షలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

సత్యదీక్షలు ప్రారంభం

Published Tue, Nov 7 2023 11:52 PM

సత్యదీక్ష సందర్భంగా స్వామి, అమ్మవారికి పూజలు చేస్తున్న పండితులు  - Sakshi

అన్నవరం : శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి జన్మనక్షత్రం మఖ సందర్భంగా మంగళవారం దేవస్థానంలో శ్రీ సత్యదీక్షలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి విడతల వారీగా భక్తులు రత్నగిరిపై శ్రీసత్యదేవుని ఆలయంతో బాటు శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ, కొండ దిగువన వివిధ ఆలయాలలో అర్చకులు, గురుస్వాముల చేతుల మీదుగా ఈ దీక్షలు స్వీకరించారు. ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌, వ్రత పురోహితులు, అర్చకులతో సహ సుమారు వేయి మంది ఈ దీక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా సత్యదేవుని వార్షిక కల్యాణ మంటపం వద్ద సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అఖండ దీపం ఏర్పాటు చేశారు. దీక్షలు పూర్తయ్యేవరకు ఈ దీపం వెలుగుతూ ఉంటుందని పండితులు తెలిపారు.

దీక్షలు స్వీకరించిన మూడు వేల మంది

కాకినాడ జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వేయి మంది సత్యదీక్షలు చేపట్టినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. 27 రోజుల పాటు సత్యదీక్షలు కొనసాగుతాయి. డిసెంబర్‌ నాలుగో తేదీన స్వాములు సత్యదేవుని సన్నిధిన ఇరుముడులు సమర్పించి దీక్ష విరమించనున్నారు. సుమారు రెండు వేల మందికి ఉచితంగా దీక్షా వస్త్రాలు, మాలలు, పూజ పుస్తకం దేవస్థానం తరఫున పంపిణీ చేశారు.

ప్రతీ ఆదివారం సత్య భజన

సత్యదీక్ష చేపట్టిన పురుషులను సత్యదేవ, మహిళలను సత్య లేదా సత్తమ్మగా పిలవాలి. ప్రతి ఆదివారం వార్షిక కల్యాణ మంటపం వద్ద సత్యదీక్ష స్వాములతో భజన ఉంటుంది. డిసెంబర్‌ మూడో తేదీ రాత్రి ఏడు గంటల నుంచి పడిపూజ నిర్వహిస్తాం. నాలుగో తేదీ ఉదయం ఏడున్నర గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. గిరిప్రదక్షిణ అనంతరం ఇరుముడులు సమర్పించాలి. పురుషులు కేశఖండన చేయించుకోవాలి. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి సత్యదేవుని వ్రతాలు ఆచరించాలి.

– ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement