జాతీయ రహదారిపై ‘నకిలీ’ల దందా | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై ‘నకిలీ’ల దందా

Published Mon, Nov 13 2023 11:38 PM

సీఐ కాశీవిశ్వనాథ్‌ - Sakshi

ఇద్దరి అరెస్టు

రాజానగరం: జాతీయ రహదారిపై పీడీఎస్‌ బియ్యాన్ని అనధికారికంగా రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డగించి, విలేకరులమని, విజిలెన్స్‌ అధికారులమని చెప్పి బెదిరించి దందాకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తుల ముఠాలో ఇద్దరు రాజానగరం పోలీసులకు చిక్కారు. స్థానిక సీఐ కాశీవిశ్వనాథ్‌ తెలిపిన వివరాలిలావున్నాయి. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఇంటింటికీ తిరిగి కొనుగోలు చేసి, రవాణా చేయడం సతీష్‌ అనే వ్యక్తి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ రాత్రి పిఠాపురం మండలం, విరవకు చెందిన సంగుల వరప్రసాద్‌, భూజేంద్రస్వామిల ద్వారా వ్యాన్‌లో న్యూజివీడు నుంచి కాకినాడ పోర్టుకు పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఈ ముఠా సభ్యులు గొల్లపల్లి చక్రధర్‌ (రాగంపేట), నాగిరెడ్డి వెంకటరమణమూర్తి (జగ్గంపేట మండలం, రాజపూడి), ఇమ్మల సత్తిబాబు (సామర్లకోట), జాగు దుర్గారావు (గొల్లప్రోలు), సంగన బుజ్జి (కాండ్రకోట సమీపంలోని మర్లావ) రాజానగరం – కలవచర్ల జంక్షన్‌లో ఆ వ్యాన్‌ను ఆపారు. కారులో వచ్చిన వారిలో ఇద్దరు బయటకు దిగి తాము విలేకరులమని, లోపల విజిలెన్స్‌ అధికారులున్నారంటూ ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ అయిన సంగుల వరప్రసాద్‌ నుంచి రూ.లక్ష డిమాండ్‌ చేశారు. కేసు నమోదైతే వ్యాన్‌ కూడా మిగలదని బెదిరించారు. చివరకు రూ.20 వేలకు బేరం కుదుర్చుకుని, సొమ్ము తీసుకున్నారు. అదే సమయంలో గస్తీ తిరుగుతున్న ఎస్సై సుధాకర్‌ అనుమానంతో వారి వద్ద ఆగడంతో కారులో ఉన్న ముగ్గురితోపాటు బయట ఉన్న ఇద్దరు కూడా పరారయ్యారు. ఆ పై వ్యాన్‌ డ్రైవర్‌ వరప్రసాద్‌ నుంచి కూపీ లాగగా ఇదే విధంగా ఈ ముఠా సభ్యులు రాజమహంద్రవరం – కాకినాడ మధ్యలో పలుమార్లు సొమ్ము వసూలు చేసినట్టు తెలుసుకున్నారు. అనంతరం వ్యాన్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. పరారైన నిందితులలో నాగిరెడ్డి వెంకటరమణమూర్తి, ఇమ్మల సత్తిబాబును అరెస్టు చేశామని సీఐ తెలిపారు. వీరిని రిమాండ్‌కి తరలిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement