రబీకి గ్రీన్‌ సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

రబీకి గ్రీన్‌ సిగ్నల్‌

Published Mon, Nov 13 2023 11:38 PM

తూర్పు డెల్టా ప్రధాన పంట కాలువ  - Sakshi

చర్చించాక తుది నిర్ణయం

గోదావరి డెల్టా రబీ ఆయకట్టుపై మంగళవారం నుంచి జిల్లాల వారీగా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాలు జగనున్నాయి. నీటి లభ్యత, కొరత, ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నీటి సేకరణపై చర్చించనున్నాం. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించిన తరువాత రబీ ఆయకట్టుపై స్పష్టత వస్తోంది.

– శ్రీనివాసరావు,

ఎస్‌ఈ, ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌.

రబీ సమయంలో నీటి వినియోగం ఇలా

రోజుకు నెలకు అవస

నెల రోజులు ఇచ్చే నీరు రమైన నీరు

(క్యూసెక్కులలో) (టీఎంసీలలో)

డిసెంబర్‌ 31 6,000 16.07

జనవరి 31 8,000 21.42

ఫిబ్రవరి 29 9,000 22.55

మార్చి 31 9,000 24.09

తాగునీరు 122 7.22

మొత్తం 91.35

నీటి కొరత అధిగమించేందుకు

ప్రత్యామ్నాయ పద్ధతులపై ఫోకస్‌

గతేడాది తరహాలోనే సరఫరాకు చాన్స్‌

నేటి నుంచి ఐఏబీ సమావేశాలు

సాక్షి అమలాపురం: గోదావరి డెల్టాలో రబీ ఆయకట్టుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. వర్షాభావ పరిస్థితులు.. ఈ ఏడాది గోదావరిలో ఇన్‌ ఫ్లో తక్కువగా నమోదు కావడంతో రబీ సాగుకు నీటి లభ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాగుకు అవసరమైన నీటి లభ్యతలో 8.86 టీఎంసీల కొరత ఉన్నప్పటికీ దానిని అధిగమించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతులకు సిద్ధమవుతూ ఆయకట్టు మొత్తానికి నీరు ఇవ్వనున్నారు.

అత్యధిక సాగు విస్తీర్ణం

రాష్ట్రంలోనే రబీ ఆయకట్టులో కీలకమైనది గోదావరి డెల్టా. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో డెల్టా విస్తరించి ఉంది. అధికార గణాంకాల ప్రకారం మొత్తం ఆయకట్టు 10.36 లక్షల ఎకరాలు. దీనిలో తూర్పు డెల్టా 2,64,507 ఎకరాలు, మధ్యడెల్టా 1,72,000, పశ్చిమ డెల్టా 4,60,000 ఎకరాల చొప్పున మొత్తం వరి ఆయకట్టు 8,96,507 ఎకరాలు. కానీ వాస్తవ సాగు 7.50 లక్షల ఎకరాలు ఉంటోంది. మిగిలిన ఆయకట్టులో ఆక్వా చెరువులు, రియల్‌ ఎస్టేట్‌ భూములు మెరక చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు.

అవసరం ఎంతంటే..

ఈ ఏడాది గోదావరిలో ఇన్‌ ఫ్లో తక్కువగా ఉంది. దీంతో రబీ సాగుపై ఇది ప్రభావం చూపిస్తోందని రైతులు ఆందోళన చెందారు. కాని సహజ జలాల రాక, పోలవరం ప్రాజెక్టు వద్ద నిల్వ ఉన్న నీటిని పరిగణలోకి తీసుకుంటే కొరత చాలా తక్కువగా ఉండనుంది. మొత్తం ఆయకట్టు పరిధిలో సాగు, తాగునీటికి 91.35 టీఎంసీలు అవసరం. డెల్టాలో రబీ షెడ్యూలు డిసెంబర్‌ 15న మొదలై మరుసటి ఏడాది ఏప్రిల్‌ 15 వరకు ఉంటోంది. కాని సాగునీటి పారుదల శాఖ అధికారులు డిసెంబర్‌ 1 నుంచి మార్చి 31 వరకు రబీ షెడ్యూలుగా నిర్ణయించారు. ఈ కాలంలో పంటతోపాటు తాగునీటికి కలిపి 91.35 టీఎంసీల నీరు అవసరంగా గుర్తించారు.

కొరత

అధిగమించేందుకు

డెల్టా అవసరాలకు సరిపడే నీటికి కొంత కొరత ఏర్పడనుంది. అధికారులు నిర్ణయించిన షెడ్యూలు సమయంలో సీలేరు నుంచి వాటాగా వచ్చే నీటి లభ్యత 40.49 టీఎంసీలు. పోలవరం ప్రాజెక్టు నుంచి 12 టీఎంసీలు, సహజ జలాలు (ఫిబ్రవరి నెలాఖరు వరకు అంచనా) 30 టీఎంసీలు వస్తుంది.

మొత్తం నీటి లభ్యత 82.49 టీఎంసీలు కాగా, కొరత 8.86 టీఎంసీలు. అందుకే అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటిని సేకరించాలని నిర్ణయించనున్నారు. పంట కాలువలపై వంతుల వారీ విధానంతో నీటిసరఫరా చేస్తే 5 టీఎంసీల నీటిని, మురుగునీటి కాలువలపై క్రాస్‌బండ్‌లు వేయడం, మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం ద్వారా 3.86 టీఎంసీలు సేకరించాలని నిర్ణయించారు. తద్వారా మొత్తం ఆయకట్టుకు సాగు నీరందించనున్నారు. గత ఏడాది కూడా ఇలాగే చేశారు. ఈ నేపథ్యంలో డెల్టా పరిధిలో మంగళవారం నుంచి జిల్లాల వారీగా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం జరుగుతుంది. ఇందులో మొత్తం ఆయకట్టుకు నీరందించడంపై నిర్ణయం తీసుకోవడం లాంఛనమే కానుంది. ప్రభుత్వం తమకు అనుకూల నిర్ణయం తీసుకుంటారని తెలిసిన డెల్టా ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి డెల్టాలో

రబీలో దిగుబడి జోరు

డెల్టాలో వరి సగటు దిగుబడి ఖరీఫ్‌లో 28 బస్తాలు (బస్తా 75 కేజీలు) కాగా, రబీలో 45 బస్తాలు. డెల్టాలో ఖరీఫ్‌ కన్నా రబీ దిగుబడి అధికం. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏకంగా 34 నుంచి 48 బస్తాల వరకు దిగుబడిగా వస్తోంది. రబీలో సైతం 45 బస్తాల సగటు దిగుబడి అయినప్పటికీ అంతకన్నా అధికంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 45 బస్తాలు అనుకున్న డెల్టాలో 25.31 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిగా రానుంది. ఈ కారణంగా రైతులు రబీ సాగుపై అధికంగా ఆశలు పెట్టుకుంటారు.

డెల్టాలో వరిచేలు
1/1

డెల్టాలో వరిచేలు

Advertisement
Advertisement