24లోపు ఉమ్మడి ఖాతా తెరవాలి | Sakshi
Sakshi News home page

24లోపు ఉమ్మడి ఖాతా తెరవాలి

Published Thu, Nov 16 2023 6:14 AM

-

అమలాపురం రూరల్‌: జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో విడత లబ్ధి పొందేందుకు ఈ నెల 24వ తేదీలోగా విద్యార్థి, తల్లితో కలిసి బ్యాంక్‌ జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ విద్యాసంవత్సరం 2022–23లో ఫైనలియర్‌ పూర్తయిన వారు, ఎస్సీ విద్యార్థులు మినహా, మిగిలినవారు తప్పనిసరిగా జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని అన్నారు. విద్యార్థి ప్రైమరీ అకౌంట్‌ హోల్డర్‌, తల్లి సెకండరీ అకౌంట్‌ హోల్డర్‌గా ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ తల్లి మరణిస్తే తండ్రి లేదా సంరక్షకుడు సెకండరీ అకౌంట్‌ హోల్డర్‌గా ఉండాలని సూచించారు. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అందరూ కలిసి ఒకే బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చని సూచించారు. రాష్ట్రంలోని ఏ బ్యాంకులోనైనా జాయింట్‌ ఖాతా తెరవవచ్చని, ఏటీఎం, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి సేవలు ఉండకూడదన్నారు. చెక్‌ బుక్‌ సౌకర్యం కలిగి ఉండొచ్చన్నారు. జాయింట్‌ అకౌంట్‌కు ఆధార్‌ సీడింగ్‌ అవసరం లేదని తెలిపారు. ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన నిధులు ఖాతాలో జమ చేస్తారని కలెక్టర్‌ తెలిపారు.

పోర్టిఫైడ్‌ బియ్యంపై

అసత్య ప్రచారాలు

అమలాపురం టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తున్న పోర్టిఫైడ్‌ బియ్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కిరణ్‌ తెలిపారు. ఆ బియ్యాన్ని ప్లాస్టిక్‌ బియ్యం అని ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాల ద్వారా చేస్తున్న ఆసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అమలాపురంలో కిరణ్‌ బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా లేనివిధంగా విటమిన్‌ బి 12, ఐరెన్‌, జింక్‌ వంటి ఔషధ గుణాలు ఉన్న బియ్యాన్ని సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. ప్రతి 50 కిలోల బియ్యంలో 500 గ్రాములు (అర కేజీ) పోర్టిఫైడ్‌ బియ్యాన్ని కలుపుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ బియ్యాన్ని ఎసరులో వేసిన తర్వాత అన్నంలో కరిగిపోతాయని చెప్పారు. ఇలాంటి ప్రక్రియ వల్ల ప్రజలకు రక్తహీనత వంటి సమస్యలు దూరం అవుతాయని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రజలకు పోర్టిఫైడ్‌ బియాన్ని అందించే ప్రక్రియ అమలు కోసం సన్నాహాలు జరుగుతున్న విషయాన్ని కిరణ్‌ గుర్తు చేశారు.

పొత్తులపై ప్రజలకు

సమాధానం చెప్పాలి

అమలాపురం టౌన్‌: రాష్ట్రంలో పొత్తుతో ఒక్కటైన తెలుగుదేశం, జనసేన పార్టీలు అదే తెలంగాణలో చెరో పార్టీతో అంటకాగుతూ ప్రజలనే కాదు వారి పార్టీల శ్రేణులను కూడా అయోమమంలో పడేస్తున్నాయని ఏపీ అగ్రి మిషన్‌ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) అన్నారు. అమలాపురంలో బాబి స్థానిక మీడియాతో బుధవారం మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అదే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్‌కు పరోక్ష మద్దతు ఇస్తుండగా, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ రాష్ట్రంలోని మద్దతు, పొత్తులపై ఆ నాలుగు పార్టీలూ టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రజలకు వివరణ ఇవ్వాలని బాబి డిమాండ్‌ చేశారు. పొత్తుల విషయంలో నిర్ధిష్టమైన నిర్ణయంతో, సిద్ధాంతంతో ముందుకు వెళ్లాల్సిన పార్టీలు ఆంధ్రలో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరించడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారని అన్నారు.

Advertisement
Advertisement