పంచతంత్రం.. పొదుపు మంత్రం | Sakshi
Sakshi News home page

పంచతంత్రం.. పొదుపు మంత్రం

Published Thu, Nov 16 2023 6:14 AM

కూనవరం ప్రధాన మురుగునీటి కాలువపై క్రాస్‌బండ్‌ (ఫైల్‌)   - Sakshi

ప్రణాళికాబద్ధంగా ముందుకు..

జిల్లా రబీ ఆయకట్టుపై ఐఏబీలో ప్రజాప్రతినిధులు, జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. నీటి లోటును అధిగమించేందుకు వంతుల వారీ విధానం, క్రాస్‌బండ్‌ల ఏర్పాటు చేయడంపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతాం.

– బుల్లిరాజు, ఇరిగేషన్‌ శాఖ జిల్లా అధికారి

సాక్షి అమలాపురం: గోదావరి డెల్టాలో రబీ సాగుకు జిల్లా యంత్రాంగం పంచ విధానాలు అవలంబించనుంది. ఇలా చేయడం వల్ల నీటి ఎద్దడిని అధిగమించడంతోపాటు అధిక దిగుబడులు సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు. నీటి వినియోగంలో పొదుపు పాటించడంతోపాటు వృథా జలాలను చేలకు మళ్లించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. అమలాపురం కలెక్టరేట్‌లో గురువారం జరగనున్న సాగునీటి సలహా మండలి సమావేశంలో రబీ పూర్తి ఆయకట్టుకు అనుమతి ఇవ్వడంతోపాటు నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాలలో కలిపి 3.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో వరి ఆయకట్టు అంచనా 1.90 లక్షల ఎకరాలు. మొత్తం డెల్టాకు అధికారులు నిర్ణయించిన డిసెంబర్‌ 1 నుంచి మార్చి 31 వరకు 91.35 టీఎంసీలు అవసరం కాగా నీటి లభ్యత 82.49 టీఎంసీలు మాత్రమే ఉంది. 8.86 టీఎంసీల కొరత ఉన్నా రైతులు రబీ దిగుబడులపై భారీగా ఆశలు పెట్టుకున్నందున మొత్తం ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవడంపాటు అధిక దిగుబడులు సాధించేందుకు జిల్లా యంత్రాంగం ‘పంచ సూత్రాల’ను ప్రతిపాదిస్తోంది ఇలా..

ముందస్తు సాగు

రబీ ముందస్తు సాగు ద్వారా నీటి ఎద్దడిని అధిగమించే అవకాశముంది. ఇరిగేషన్‌ అధికారుల అంచనా ప్రకారం గోదావరిలో సహజ జలాల లభ్యత ఫిబ్రవరి నెలాఖరు వరకు మాత్రమే ఉంటుంది. తరువాత మొత్తం సీలేరు పవర్‌ జనరేషన్‌ నుంచి వచ్చే నీటి మీదనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. అప్పడు సీలేరు పవర్‌ జనరేషన్‌ నుంచి 4,000 క్యూసెక్కులు, బైపాస్‌ పద్ధతిలో రెండు వేల క్యూసెక్కులు నీరు ఇచ్చినా పంట కాలువలకు పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్‌ 10నాటికి నాట్లు పూర్తి చేయాలని, వెదజల్లు పద్ధతి పాటించాలని వ్యవసాయ, ఇరిగేషన్‌ అధికారులు కోరుతున్నారు. ఇలా చేస్తే మార్చి నెలాఖరు నాటికి సాధ్యమైనంత వరకు కోతలు మొదలైతే నీటి ఎద్దడి తప్పే అవకాశముంటుంది.

వారాబందీ

గోదావరి డెల్టా కాలువల ద్వారా నీటి సరఫరాను సాధ్యమైనంత త్వరగా వారాబందీ (వంతుల వారీ విధానం) అమలు చేయనున్నారు. గతంలో నీటి లభ్యతను బట్టి సంక్రాంతి తరువాత, ఫిబ్రవరిలో ఈ విధానం అమలు చేసేవారు. కాని ఇప్పుడు అంతకన్నా ముందే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇలా చేయడం ద్వారా సుమారు 5 టీఎంసీల నీటిని ఆదా చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

క్రాస్‌బండ్‌ల ఏర్పాటు

మురుగునీటి కాలువలపై క్రాస్‌బండ్‌లు పెద్ద ఎత్తున వేయనున్నారు. గత రబీ కాలంలో ప్రభుత్వం రూ.3.45 కోట్లు కేటాయించి 189 చోట్ల క్రాస్‌బండ్‌లను నిర్మించింది. ఈసారి కూడా ఇదే విధానం అవలంబించనున్నారు.

మోటార్లతో ఎత్తిపోతలు

మెరక చేలకు పంట కాలువలో నీరు మోటార్లతో తోడడంతోపాటు మురుగునీటి కాలువలో వృథా నీటిని పంట కాలువల ద్వారా చేలకు మళ్లించనున్నారు. ఇందుకు అయ్యే డీజిల్‌ ఖర్చును గతంలో ప్రభుత్వం ఇచ్చింది. ఈసారి కూడా ఇవ్వాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. క్రాస్‌బండ్‌లు వేయడం, మోటార్ల ద్వారా నీటి తోడకం వల్ల సుమారు 3.86 టీఎంసీలు సేకరించాలని నిర్ణయించారు.

ఎండు–పండు

‘వరి నీటిలో పెరిగే మొక్కే కాని... నీటిలో మాత్రమే పెరిగే మొక్క కాదు’. నాట్లు వేసే సమయంలోనూ... దబ్బులు చేసి పంట చేలు పాలుపోసుకునే సమయంలో మినహా మిగిలిన సమయంలో పొలాల్లో నీరు తక్కువగా ఉంటే అధిక దిగుబడి వస్తుంది. అందుకే ‘ఎండు– పండు’ అంటారు. రబీకి నీటి ఎద్దడి వచ్చిన సమయంలో రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో సగటు దిగుబడి 28 బస్తాలు (బస్తా 75 కేజీలు) కాగా డెల్టాలో కొన్నిచోట్ల 48 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. ఇదే విధానం అవలంబిస్తే దిగుబడి రావడంతోపాటు నీటి సరఫరాపై ఒత్తిడి తగ్గుతుందని, రబీ గట్టెక్కుతామని అధికారులు చెబుతున్నారు.

ఈ ఐదు సూత్రాల ద్వారా రబీని విజయవంతంగా పండించవచ్చని సాగునీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు ధీమాగా చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా రైతులకు అవగాహన కల్పించేందుకు త్వరలోనే రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే)ల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. పనిలో పనిగా నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలైన మొక్కజొన్న, అపరాల సాగును మెరక ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించాలని నిర్ణయించనున్నారు. మొత్తం మీద గురువారం జరిగే ఐఏబీ సమావేశంలో మొత్తం ఆయకట్టుకు అనుమతి లాంఛనమే అయినా... ప్రత్యామ్నాయ చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

డెల్టాలో రబీకి ఐదు సూత్రాలతో

నీటి ఎద్దడికి చెక్‌

నేడు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం

రబీ లక్ష్యం 1.72 లక్షల ఎకరాలు

నీటి లభ్యత తక్కువగా ఉన్నా

మొత్తం ఆయకట్టుకు నీరు

1/1

Advertisement
Advertisement