బాస్మతి.. బ్లాక్‌ బస్టర్‌ | Sakshi
Sakshi News home page

బాస్మతి.. బ్లాక్‌ బస్టర్‌

Published Wed, Nov 22 2023 11:48 PM

బ్లాక్‌ బాస్మతి ధాన్యం - Sakshi

పిఠాపురం: వరిలో అనేక రకాలు ఉన్నాయి. నేల స్వభావాలను బట్టి కొన్ని రకాలే పండుతుంటాయి. కానీ గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన ఓదూరి నాగేశ్వరరావు తన పొలంలో ప్రయోత్మకంగా కొత్త వంగడాన్ని వేసి సత్ఫలితాలు సాధించారు. మణిపూర్‌ బాస్మతి బ్లాక్‌ రైస్‌ను పండించి రైతు తలుచుకుంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించారు. ఇప్పటికే ఉద్యాన పంటల్లో వినూత్న పంటలు పండించి అబ్బురపరచిన నాగేశ్వరరావు తన మూడున్నర ఎకరాల పొలంలో బర్మా నుంచి తెప్పించిన బ్లాక్‌ బాస్మతి రైస్‌ను సాగు చేశారు. ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో సాగు చేయడంతో ఎటువంటి తెగుళ్లు సోకకుండా పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ఎకరానికి 25 బస్తాల దిగుబడి రాగా ఈ బియ్యం మార్కెట్‌లో కిలో రూ.450 పలుకుతుండడంతో ఆదాయం భారీగా వచ్చింది.

కొత్త వంగడంతో నల్ల బియ్యాన్ని

పండించిన చేబ్రోలు రైతు

సేంద్రియ పద్ధతిలో పంట సాగు,

రికార్డు స్థాయిలో దిగుబడి

పోషక విలువలు ఎక్కువ

ఈ బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్లు, యాత్రో సైనిక్‌, యాంటీ డయాబెటిక్‌, యాంటీ క్యాన్సర్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఒబేసిటీగా ఈ బియ్యం పనిచేస్తాయి. అందుకే వీటికి విలువ ఎక్కువ. మార్కెట్‌లో ధర ఎక్కువగానే ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వాటికి మరింత గిరాకీ ఉంటుంది. రైతు నాగేశ్వరరావు విభిన్న పంటల సాగులో మంచి ప్రావీణ్యం కనబరుస్తుంటారు.

– సత్యనారాయణ,

వ్యవసాయశాఖాధికారి, గొల్లప్రోలు

ప్రయోగాత్మకంగా సాగు

బ్లాక్‌ బాస్మతి రైస్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని తెలిసి ప్రయోగాత్మకంగా సాగు చేశాను. పెట్టుబడి తక్కువగా ఉండేందుకు సేంద్రియ పద్ధతి పాటించాను. విత్తనాలను బర్మా నుంచి తెప్పించి సాగు చేయగా ఎటువంటి తెగుళ్లు లేకుండా ఏపుగా పెరిగి, ఎకరానికి 25 బస్తాల దిగుబడి వచ్చింది. పెట్టుబడి చాలా తక్కువ అయ్యింది.

– ఓదూరి నాగేశ్వరరావు, రైతు, చేబ్రోలు

బ్లాక్‌ బాస్మతి రైస్‌
1/3

బ్లాక్‌ బాస్మతి రైస్‌

బ్లాక్‌ బాస్మతి రైస్‌ సాగు చేసిన పొలం
2/3

బ్లాక్‌ బాస్మతి రైస్‌ సాగు చేసిన పొలం

3/3

Advertisement
Advertisement