రత్నగిరిపై నగదు ఇబ్బందులు | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై నగదు ఇబ్బందులు

Published Sat, Dec 2 2023 2:42 AM

వ్రతాల టిక్కెట్లు కోసం క్యూ లో నిల్చున్న భక్తులు (ఫైల్‌)   - Sakshi

రెండు ఏటీఎంల తొలగింపు

● దేవస్థానంలో స్టేట్‌బ్యాంక్‌ ఏటీఎం 30 వీఐపీ సత్రంలో ఉండేది. ఈఓ కార్యాలయం ఎదురుగా పార్కింగ్‌ స్ధలంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో, అన్నదాన భవనంపై భాగంలో యూనియన్‌ బ్యాంక్‌ (ఆంధ్రా బ్యాంక్‌) ఏటీఎంలు ఉండేవి. 30 వీఐపీ సత్రం, ఈఓ కార్యాలయం ఎదురుగా గల పార్కింగ్‌ స్థలంలో గల షాపింగ్‌ కాంప్లెక్స్‌ను మూడు నెలల క్రితం కూల్చేశారు. అప్పుడు వాటిలోని ఏటీఎం మెషీన్లను మరో చోటకు తరలించారు. కానీ ఎక్కడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేస్తోంది.

● డిజిటల్‌ పేమెంట్లకు అనుమతించాలని, రెండు ఏటీఎంలను మరోచోట పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.

డిజిటల్‌ పేమెంట్లకు నో ఛాన్స్‌

తెలియక భక్తులు లబోదిబో

ప్రతీ కొనుగోలుకు నగదు

చెల్లించాల్సిందే

ఉన్న రెండు ఏటీఎంలూ తొలగింపు

పునరుద్ధరించాలని అభ్యర్థన

అన్నవరం: ఇప్పుడు అన్ని చోట్లా డిజిటల్‌ పేమెంట్లు జరుగుతున్నాయి. చాలామంది నగదు జేబులో పెట్టుకోవడం మానేశారు. టీ దగ్గర నుంచి జామకాయల వ్యాపారి వరకూ అందరూ ఫోన్‌ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. తేగలు అమ్మే వారూ ఫోన్‌ పే సౌకర్యం పెట్టుకుంటున్నారు. లేకపోతే వ్యాపారంలో నష్టపోతామని అర్థం చేసుకున్నారు. ఎక్కడా చూసినా డిజిటల్‌ చెల్లింపులే. కానీ నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మాత్రం డిజిటల్‌ పేమెంట్లకు అవకాశం లేదు. దీంతో కొండకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఏ కౌంటర్లోనూ డిజిటల్‌ లేదు

రత్నగిరి సత్యదేవుని సన్నిధిలో స్వామివారి వ్రతం, దర్శనం, ప్రసాదం టిక్కెట్ల కొనుగోలుకు, వసతి గదుల రుసుం చెల్లించేందుకు నగదు చెల్లించాలనే సరికి భక్తులు విస్తుపోతున్నారు. ఫోన్‌ పే, పేటీఎం, గూగుల్‌ పే, తదితర డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు ఇక్కడ సౌకర్యం కల్పించలేదు. ఈ విషయం తెలియని భక్తులు తక్కువ నగదుతో దేవస్థానానికి వచ్చి సరిపోక నరకయాతన పడుతున్నారు. ప్రతీ చెల్లింపునకు నగదు ఇవ్వాల్సి ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రిడెట్‌, డెబిట్‌ కార్డులను కూడా అంగీకరించడం లేదు. పోనీ నగదు విత్‌డ్రా చేద్దామన్నా వీలు లేకుండా పోయింది. భవనాల కూల్చివేతలో రెండు ఏటీఎంలనూ తొలగించారు. వాటిని దేవస్థానంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఉన్న ఒక్క ఏటీఎంలో బ్యాంక్‌ సిబ్బంది నగదు నింపిన కొద్ది సమయానికే ఖాళీ అయిపోతోంది. కొందరు కొండ దిగువకు వచ్చి డబ్బులు తీసుకోవాల్సి వస్తోందని కాకినాడకు చెందిన రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.

రోజూ ఆదాయం

● రత్నగిరికి రోజూ సుమారు పది వేల నుంచి 50 వేల మంది వరకు భక్తులు వస్తారు. పర్వదినాలలో సంఖ్య లక్ష కూడా దాటుతుంది. భక్తుల ద్వారా దేవస్థానానికి ఆదాయం కూడా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు, పర్వదినాలలో రూ. కోటి వరకు కూడా ఉంటుంది. అంతా కూడా నగదు రూపమే కావడంతో లెక్కింపు కూడా సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది.

● దేవస్థానంలోని ప్రతీ కౌంటర్‌లో కూడా నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఉండడంతో భక్తులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అదే సమయంలో కొండమీద ప్రైవేట్‌ షాపులు, క్యాంటీన్‌ నిర్వాహకులు డిజిటల్‌ పేమెంట్స్‌ను అంగీకరిస్తున్నారు. దీంతో భక్తులు వారిని నగదు ఇవ్వండి ఫోన్‌ పే ద్వారా పంపిస్తామని బతిమాలాడుకుంటున్నారు.

షాపు కేటాయిస్తే ఏర్పాటు చేస్తాం

ఏటీఎంను మరో ప్రదేశంలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని దేవస్థానం అధికారులను కోరుతున్నాం. ప్రస్తుత ఈఓ రామచంద్రమోహన్‌ మా వినతికి స్పందించారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా నిర్మిస్తున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఒక షాపు కేటాయిస్తామన్నారు. ఆ షాపు కేటాయించిన వెంటనే ఏటీఎం ఏర్పాటు చేస్తాం.

రఘురామ్‌, స్టేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌

తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరుకు చెందిన సుధాకర్‌ దంపతులు అన్నవరం దర్శనానికి వచ్చారు. అన్ని చోట్లా డిజిటల్‌ పేమెంట్లు ఉన్నాయనే భావనతో వారు వెంట ఏ మాత్రం నగదు తెచ్చుకోలేదు. దర్శనం టికెట్‌ మొదలుకుని ప్రసాదం కొనేవరకూ చాలా అవస్థలు పడ్డారు. దీంతో ఒక పూట అనవసరంగా ఉండాల్సి వచ్చింది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన వై.రామకృష్ణ తన కుటుంబ సభ్యులతో అన్నవరం వచ్చారు. ఫోన్‌ పే సౌకర్యాన్ని కొండమీద అనుమతించకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. వేరొకరిని బతిమలాడి ఫోన్‌ పే ద్వారా అమౌంట్‌ వేసి నగదు తీసుకుని దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. ఈలోగా చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యారు.

అన్నవరం దేవస్థానం
1/2

అన్నవరం దేవస్థానం

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement